చూడగానే మనోడే అనిపించే పర్సనాలిటీ. ఒక్కమాటలో చెప్పాలంటే పక్కింటి కుర్రాడికి మల్లే ఉంటాడు రాజ్ తరుణ్. అదే అతనికి ఎస్సెట్ అనీ చెప్పొచ్చు. అనేక లఘు చిత్రాల్లో నటించిన రాజ్ తరుణ్ కు దర్శకుడు కావాలన్నది అభిలాష. ఆ కోరికతోనే చిత్రసీమలో అడుగు పెట్టాడు. ‘ఉయ్యాల జంపాల’ చిత్రానికి స్టోరీ, డైరెక్షన్ డిపార్ట్ మెంట్స్ లో వర్క్ చేయసాగాడు. ఆ సమయంలోనే ఆ చిత్ర దర్శకుడు విరించి వర్మ సినిమాలో హీరో కేరెక్టర్ కు రాజ్ తరుణ్ అయితే బాగుంటుందని భావించాడు. అలా కోరుకోకుండానే ‘ఉయ్యాల జంపాల’ హీరో అయిపోయాడు రాజ్ తరుణ్. ఇది చాలా చిన్న సినిమా. కానీ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి సురేశ్ బాబు వంటి పెద్దవారు ఈ చిత్రం రూపకల్పన వెనుక ఉన్నారు. వీరికి తోడు పి.రామ్మోహన్ కూడా సినిమాకు భాగస్వామి. అవికా గోర్ నాయికగా నటించిన ‘ఉయ్యాల జంపాల’ మంచి విజయం సాధించింది. దాంతో రాజ్ తరుణ్ నటునిగా బిజీ అయిపోయాడు.
‘ఉయ్యాల జంపాల`తో హీరో అయిపోయిన రాజ్ తరుణ్ 1992 మే 11న జన్మించాడు. చిన్నప్పటి నుంచీ చదువులోనూ, ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండేవాడు. సినిమాపై అభిమానం పెంచుకున్నాక, సినిమాలే ప్రపంచంగా సాగాడు. దాదాపు 50కి పైగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. `ఉయ్యాల జంపాల` తరువాతి చిత్రం ‘సినిమా చూపిస్త మావ’లోనూ అవికా గోర్ తో జోడీ కట్టాడు రాజ్ తరుణ్. మరో హిట్టు పట్టాడు. ఆపై ‘కుమారి 21 ఎఫ్’లోనూ హీరోగా నటించాడు. అదీ సక్సెస్ చూసింది. ఇలా వరుస విజయాలు చూసిన రాజ్ తరుణ్ కాల్ షీట్స్ కోసం జనం రావడం మొదలెట్టారు. “సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, ఈడో రకం ఆడో రకం, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, రంగుల రాట్నం, రాజుగాడు, లవర్, ఇద్దరి లోకం ఒకటే,ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే, అనుభవించు రాజా” వంటి చిత్రాల్లో నటించేశాడు రాజ్ తరుణ్. కొన్ని తీపి రుచి చూపిస్తే, మరికొన్ని చేదు అనుభవం మిగిల్చాయి.
రాజ్ తరుణ్ లో మంచి రచయిత కూడా ఉన్నాడు. అసలు దానిని నమ్ముకొనే కదా, చిత్రసీమలో అడుగు పెట్టింది. అందువల్ల రాజ్ తరుణ్ లోని రచయిత ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’లో “జానీ జానీ ఎస్ పప్పా…” సాంగ్ రాసేశాడు. తరువాత ‘రంగుల రాట్నం’లో “ప్రేమ ప్రేమా…” అనే పాటనూ పలికించాడు. ఇలా తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాలని తపిస్తున్న రాజ్ తరుణ్ సక్సెస్ రేటు నెమ్మదించింది. ఈ యేడాది `స్టాండప్ రాహుల్`తో జనం ముందు నిలిచాడు రాజ్. షరా మామూలే అన్నట్టు ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరి మునుముందు ఎలాంటి పాత్రలలో రాజ్ తరుణ్ అలరిస్తాడో చూడాలి.
