NTV Telugu Site icon

రివ్యూ: పుష్ప

pushpa

pushpa

గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా బన్నీ తొలిసారి పాన్ ఇండియా మూవీ చేయంటం, దాన్ని సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించటంతో సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. మరి ‘తగ్గేదే లే’ అంటూ జనం ముందుకు వచ్చిన ‘పుష్ప’ రాజ్ తన మాటను నిలబెట్టుకున్నాడో లేదో చూద్దాం!

అడవులను అడ్డంగా నరికేస్తూ, అక్కడి వృక్ష సంపదను, ఖనిజ సంపదను కొల్లగొడుతున్న అంశాలతో ఇటీవల చాలా సినిమాలు వచ్చాయి. అందుకు భిన్నమైన కథను ‘పుష్ప – ది రైజ్’ కోసం రచయిత, దర్శకుడు సుకుమార్ రాసుకున్నాడు. రాయలసీమలోని శేషాచలం కొండల్లో ఎర్ర చందనం మొక్కలను కొట్టే కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్ప (అల్లు అర్జున్), అతి తక్కువ సమయంలో తన తెగువతో, తెలివితేటలతో స్మగ్లింగ్ సామ్రాజ్యంలో కీలకమైన వ్యక్తిగా ఎదుగుతాడు. ఈ క్రమంలో అతన్ని అడ్డు పెట్టుకుని కోట్లు గడించిన కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్), అతని తమ్ముళ్ళకు ఎలా చుక్కలు చూపించాడు? ఎర్రచందనం సిండికేట్ లీడర్ గా చక్రం తిప్పే మంగళం శ్రీను (సునీల్)కు పక్కలో బల్లెంగా ఎలా మారాడు? చిన్నప్పుడే ఇంటి పేరు కోల్పోయిన తనను ఆ కారణంతో అవమానించే వారికి ఎలా బుద్ధి చెప్పాడు? అనేదే ఇందులోని ప్రధానాంశం. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో సుకుమార్ ఇటు మదర్ సెంటిమెంట్‌, అటు లవ్ సెంటిమెంట్ కూడా మిక్స్ చేశాడు. మొదటి నుండి చివరి వరకూ భారీ పోరాట సన్నివేశాలు ఉన్నా, మధ్య మధ్యలో తెర మీదకు వచ్చే ఈ ఉద్వేగభరిత సంఘటనలు ప్రేక్షకులకు కాస్త ఉపశమనం కలిగిస్తాయి.

సినిమా ప్రారంభమైన మరుక్షణం నుండి ఆడియెన్స్ కు పుష్ప రాజ్ తప్ప అల్లు అర్జున్ కనిపించడు. ఎవరి కిందా పనిచేయడానికి ఇష్టపడని వ్యక్తిగా, తన మాటే నెగ్గాలనే తత్త్వమున్న మొరటోడిగా బన్నీ బాగా చేశాడు. ‘తగ్గేదే లే’ అనే మేనరిజాన్ని ఒక్కో చోటా ఒక్కోలా పలికి ఆకట్టుకున్నాడు. యాక్షన్ సన్నివేశాలలోనూ ఒళ్ళు దాచుకోకుండా కష్టపడ్డాడు. ‘రంగస్థలం’లో స్టార్ హీరో రామ్ చరణ్‌ను మట్టిమనిషిగా చూపి సక్సెస్ సాధించిన సుకుమార్, ఆ సినిమా విజయం కలిగించిన నమ్మకంతో బన్నీలోని స్టైలిస్ట్ ను తీసి పక్కకు పెట్టేశాడు. ఏ పాత్రకైనా అతను ఐకాన్ గా నిలుస్తాడనే ఉద్దేశ్యంతో ‘ఐకాన్ స్టార్’ అనే బిరుదును కూడా ఇచ్చేశాడు. సుకుమార్ నమ్మకాన్ని నిలబెడుతూ, బన్నీ పుష్ప పాత్రకు ఐకాన్ గా నిలిచాడు. మనసులో ఆవేదనను తల్లితో పంచుకునే సన్నివేశంలో ఎలా గుండెల్ని పిండేశాడో, ప్రియురాలికి ప్రేమను తెలిపే సీన్ లో అంత వినోదాన్ని పండించాడు. ఇక క్లయిమాక్స్ లో ‘ఒకటి ఎక్కువుంది’ అంటూ గుండెలోని కసిని వ్యక్తం చేసిన తీరూ అమోఘం.

పాలు అమ్ముకునే దిగువ మధ్య తరగతి అమ్మాయి శ్రీవల్లి పాత్రలో రశ్మిక ఒదిగి పోయింది. బందీగా ఉన్న తండ్రిని రక్షించుకోవడానికి జాలిరెడ్డి దగ్గరకు వెళ్ళే ముందు పుష్పను కలిసి, తన ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశం మూవీకి హైలైట్. ఇక ‘సామి… నా సామి’ పాటలో మాస్ స్టెప్స్ వేసి కుర్రకారు గుండెల్లో వేడి సెగలు పుట్టించింది. పుష్ఫకు అనుక్షణం అడ్డుపడే డీఎస్పీ గోవిందప్పగా శత్రు బాగా నటించాడు. అతని మేకోవర్ ఆకట్టుకునేలా ఉంది. ఎర్రచందనం స్మగ్లర్ కొండారెడ్డిగా అజయ్‌ ఘోష్‌, అతని తమ్ముడు జాలిరెడ్డిగా కన్నడ నటుడు ధనుంజయ్ చక్కగా నటించారు.

ఈ మూవీలో స్పెషల్ సర్ ప్రైజ్ ఎలిమెంట్ అంటే సునీల్ పోషించిన మంగళం శ్రీను పాత్ర. ఎర్రచందనం స్మగ్లర్స్ సిండికేట్ నాయకుడిగా సునీల్ సూపర్ గా యాక్ట్ చేశాడు. కమెడియన్ గా తనకున్న ఇమేజ్ ను పూర్తిగా తుడిపేసి, ఓ కొత్త అవతారం ఎత్తాడు. ఇలాంటి పాత్ర చేయాలన్నది సునీల్ చిరకాల వాంఛ. దానిని తీర్చడానికి సుకుమార్ పెద్ద సాహసం చేశాడనే చెప్పాలి. సునీల్‌ లోని కమెడియన్‌ ఏ కోశానా జనాలకు గుర్తుకు రాడు. మంగళం శ్రీను భార్య దక్షగా అనసూయ నటించింది. ఆమె మేకోవర్ కూడా డిఫరెంట్ గా ఉంది. అయితే ‘రంగస్థలం’లోని అనసూయ పాత్రతో పోల్చితే, ఈ ప్రథమ భాగంలో ఆమె పాత్ర పెద్దగా లేదనే చెప్పాలి. ఈ మూవీలో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేసిన మరో వ్యక్తి సమంత. స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ ఉన్న సమంత తన కెరీర్ లో ఫస్ట్ టైమ్‌ ఐటమ్ సాంగ్ చేసింది. ఆమె బాడీలోని స్వింగ్ ను బాగా గుర్తించి, దానికి తగ్గట్టు గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ డిజైన్ చేశారు. సమంత మనోభావాలను బాగా స్టడీ చేసి చంద్రబోస్ ఈ పాట రాశాడా అనిపిస్తుంది! ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితికి ఈ లిరిక్స్ అద్దం పడతాయి. మంచి బీట్ ఉన్న ఈ పాటను జాగ్రత్తగా గమనిస్తే, చిన్న పాటి పెయిన్ కూడా కనిపిస్తుంది.

మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌ మీద మనవాళ్ళు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మలయాళంలో డిఫరెంట్‌ కాన్సెప్ట్ మూవీస్ చేసే ఫహద్ ఈ చిత్రంలో ఇరగదీస్తాడని నమ్మారు. కానీ అంతలేదు! క్లయిమాక్స్ కు కాస్తంత ముందు భన్వర్ సింగ్ షెకావత్ గా తెరపైకి వచ్చి కొంత నిరాశకు గురిచేశాడు. ‘ఒకటి తక్కువుంది…’ అంటూ అతడు చేసిన ఓవర్ యాక్షన్ భరించడం కొంచెం కష్టమే. అయితే ‘పుష్ప’ రెండో భాగంలో ఫహద్ కి ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. ఒకే తండ్రికి పుట్టిన పుష్ప అన్నలు అజయ్, శ్రీతేజ్ కు, సునీల్ వెనకుండే ‘అరుంధతి’ అరవింద్ కు ఫస్ట్ పార్ట్ లో నటించే ఛాన్స్ దక్కలేదు. అలానే రావు రమేశ్ నటనను పూర్తి స్థాయిలో ఇందులో చూసే అవకాశం లేకుండా పోయింది.

వీరందరికి రెండో భాగంలోనే న్యాయం జరుగుతుందేమో. సాంకేతిక నిపుణులలో అగ్రతాంబూలం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ కే ఇవ్వాలి. ఇందులోని అన్ని పాటలూ చార్ట్ బస్టర్స్ కావడం విశేషం. అలానే మిరోస్లా క్యూబా సినిమాటోగ్రఫీ మూవీని మరో లెవెల్ కు తీసుకెళ్ళింది. చంద్రబోస్‌ అందించిన పాటలు ఇటు సాహితీ కారుల్ని, అటు కుర్రకారుని ఆకట్టుకునే ఉన్నాయి. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ మూవీకి మరో హైలైట్. రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్ యాక్షన్స్ సీన్స్ గూజ్ బంప్స్ కలిగిస్తాయి. అయితే… మూడు గంటల రన్ టైమ్ కాస్త ఇబ్బంది కలిగించేదే. సెకండ్ పార్ట్ ఎటూ ఉంది కాబట్టి ఈ తొలి భాగాన్ని కొంత ట్రిమ్ చేసి ఉండాల్సింది. అలాంటి ప్రయత్నం దర్శక నిర్మాతలు ఎందుకు చేయలేదో అర్థం కాదు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదనేది తెర మీద చూస్తే అర్థమౌతుంది. బన్నీ ఫ్యాన్స్ కు, యాక్షన్ మూవీస్ ను ఇష్టపడే వారికి ‘పుష్ప’ సూపర్ కిక్ ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు! ఓవరాల్‌గా చూసినప్పుడు మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌కు వచ్చేసరికి మూవీ గ్రాఫ్ కొద్దిగా డౌన్ అయిన భావన సగటు ప్రేక్షకుడికి వస్తుంది. అసలు ఫైర్… సెకండ్ పార్టులో ఉంటుందని తెలిసినా ఏదో అసంతృప్తి కలుగుతుంది.

ప్లస్ పాయింట్స్
అల్లు అర్జున్ నటన
ఆర్టిస్టుల మేకోవర్
టెక్నీషియన్స్ పనితనం
సమంత ఐటమ్ సాంగ్

మైనస్ పాయింట్
బలహీనమైన క్లయిమాక్స్
మూవీ రన్ టైమ్

రేటింగ్ : 3/ 5

ట్యాగ్ లైన్‌: మాస్ మేనియా!