అనతికాలంలోనే తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు నిర్మాత సాయి కొర్రపాటి. తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మిస్తూ సక్సెస్ రూటులో సాగిపోతున్నారాయన.
సాయి అసలు పేరు కొర్రపాటి రంగనాథ సాయి. 1968 జూన్ 19న గుంటూరు పల్లపాడులో జన్మించాడు. ఆయన తండ్రి అప్పట్లోనే ఏ.ఐ.ఎమ్.ఇ., చదివి ఓ వైపు వ్యాపారం చూసుకుంటూనే, మరోవైపు వ్యవయసాయం చేసేవారు. సాయి తండ్రికి తరువాత రోజులు కలసి రాలేదు. దాంతో కుటుంబాన్ని కర్ణాటకకు మార్చేశాడు. అలా సాయి బాల్యమంతా బళ్ళారిలోనే సాగింది. అక్కడే చదువుకున్నాడు. అయితే చదువు అంతగా సాగక పోవడంతో, మెల్లగా తనకు నచ్చిన చిత్రాలను బళ్ళారి ప్రాంతంలో విడుదల చేయసాగాడు సాయి. ఆరంభంలో “సీతారామరాజు, సుబ్బు, ఆది, ఒక్కడు” వంటి చిత్రాలు పంపిణీచేశారు. ఆ పై కర్ణాటక మొత్తం డిస్ట్రిబ్యూటర్ గా మారాడు సాయి. తరువాత రాయలసీమ ప్రాంతంలోనూ పలు చిత్రాలను పంపిణీ చేశాడు. కీరవాణి కుటుంబానికి బాగా దగ్గరయ్యాడు సాయి. కీరవాణి సమీపబంధువు అయిన గుణ్ణం గంగరాజు నిర్మించిన ‘అమ్మ చెప్పింది’ నిర్మాణంలో పాలు పంచుకున్నాడు సాయి. అది నిరాశ కలిగించింది. అయినా పట్టువదలని విక్రమార్కునిలా సాయి ముందుకు సాగాడు. రాజమౌళి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై ‘ఈగ’ సినిమా నిర్మించి, ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు సాయి. ఆ తరువాత ‘అందాలరాక్షసి’ నిర్మించాడు. ఈ సినిమా ద్వారా పరిచయమైన లావణ్యా త్రిపాఠి తరువాత తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కిన ‘లెజెండ్’ అనూహ్య విజయం సాధించింది. ఏకధాటిగా వెయ్యి రోజులు ప్రదర్శితమైన చిత్రంగా ‘లెజెండ్’ నిలచింది.
తమ వారాహి చలనచిత్రం పతాకంపై “ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, రాజా చెయ్యి వేస్తే, మనమంతా, జో అచ్యుతానంద, యుద్ధం శరణం, విజేత, భళా తందనాన” వంటి చిత్రాలను నిర్మించాడు సాయి. ఇక రాజమౌళికి ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టిన ‘బాహుబలి’ సిరీస్ పంపిణీ చేయడంలోనూ, ‘కేజీఎఫ్’ సినిమాలను జనం ముందు నిలపడంలోనూ సాయి ప్రత్యేక పాత్ర పోషించాడు. ప్రస్తుతం సంగీత దర్శకులు కీరవాణి కొడుకు శ్రీసింహతో ‘ఉస్తాద్’, గాలి జనార్దన రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్నాడు సాయి. మరి మునుముందు సాయి కొర్రపాటి ఏ తరహా చిత్రాలతో జనాన్ని ఆకట్టుకుంటాడో చూడాలి.
