ఈమధ్య కాలంలో తెలంగాణలో విడుదలవుతోన్న ప్రతీ సినిమాకు టికెట్ రేట్లను అమాంతం పెంచేస్తోన్న విషయం తెలిసిందే! కరోనా కాలంలో చిత్ర పరిశ్రమ బాగా దెబ్బతిన్న నేపథ్యంలో.. గరిష్టంగా టికెట్ రేట్లను పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. అప్పటినుంచి చిన్న, పెద్ద అని తేడా లేకుండా.. విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు. దీంతో, థియేటర్లకు వెళ్ళే ఆడియన్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి సినిమాలైతే దీని వల్ల లాభాలు పొందాయి కానీ, మిగతావే బాగా దెబ్బతిన్నాయి.
తమ సినిమాకి అలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదని, అలాగే ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి తమ సినిమాని ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో.. సాధారణ టికెట్ రేట్లతోనే తాము ‘ఎఫ్3’ సినిమాని విడుదల చేస్తున్నామని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఇదివరకే ఈ వార్త బయటకు రాగా.. ఇప్పుడు అధికారికంగా నిర్మాత వెల్లడించారు. ఎలాంటి టికెట్ ధరల హైక్‌తో తాము ‘ఎఫ్3’ని రిలీజ్ చేయడం లేదని, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సాధారణ ధరలకే టికెట్స్ అందుబాటులో ఉంటాయని అన్నారు. ఇందుకు సంబంధించి, రెండున్నర నిమిషాల నిడివి గల ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. సినీ ప్రియులకి ఇది నిజంగా శుభవార్తేనని చెప్పాలి.
కాగా.. ఎఫ్2కి సీక్వెల్‌గా వస్తోన్న ఎఫ్3లో దాదాపు అందులో నటించిన తారాగణమే ఉంది. వెంకటేశ్ – తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ జంటలుగా నటిస్తుండగా.. సునీల్, సోనాల్ చౌహాన్ కొత్తగా జత అయ్యారు. వీళ్లిద్దరు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఎఫ్2 మంచి విజయం సాధించిన నేపథ్యంలో, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీతనంతో దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో.. పూజా హెగ్డే కూడా ఓ ప్రత్యేక గీతంలో తళుక్కుమంది.