NTV Telugu Site icon

Priyanka Singh: కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నా.. ఆ సర్జరీ తరువాత అక్కడ నొప్పి తట్టుకోలేక

Priyanka

Priyanka

Priyanka Singh: ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి.. బిగ్ బాస్ లోకి వెళ్లి తనలాంటి వారికి కూడా గుర్తింపు కావాలని చెప్పుకొచ్చి.. పేరు తెచ్చుకుంది. ఇక అమ్మాయిగా మారడానికి ఎంతో కష్టపడింది. ఎన్నో అవమానాలను భరించింది. ఇంట్లో తల్లిదండ్రులే అర్ధం చేసుకోకపోతే బయటికి వచ్చి ఒక్కత్తే కష్టపడి సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారింది. ఇక హీరోయిన్లు కు ఉన్న అందం ప్రియాంక సొంతం. బిగ్ బాస్ నుంచి వచ్చాకా మంచి షోస్ చేస్తూ బిజీగా మారింది. త్వరలోనే ఓటిటీలో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఇక తాజాగా ప్రియాంక సింగ్.. నిఖిల్ తో నాటకాలు అనే పాడ్ కాస్ట్ లో పాల్గొంది. ఇందులో తన మనోగతాన్ని మొత్తం వెల్లడించింది.

“చిన్నతనం నుంచి నాకు ఆడపిల్లలా రెడీ అవ్వాలని ఉండేది. అక్క స్కూల్ నుంచి రాగానే ఆమె బట్టలు వేసుకొని రెడీ అయ్యేదాన్ని. ఇక నా పదో తరగతి పూర్తికాగానే హైదరాబాద్ వచ్చేసాను. ముందుగా మేకప్‌ ఆర్టిస్టుగా చేశాను.. ఆ తరువాత జబర్దస్త్ లో ఛాన్స్ వచ్చింది. లేడీ గెటప్స్‌ వేశాను. ఇక అక్కడ గుర్తింపుతో బయట షోలు వచ్చాయి. అలా నేను కూడబెట్టిన డబ్బుతో సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ తరువాత భరించలేని నొప్పి. హాస్పిటల్ లో ఎవరు పట్టించుకొనేవాళ్ళు లేరు. అలాగే రక్తం కారుతున్నా కూడా ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి గేటు వరకు నడుచుకుంటూ వెళ్లాను. సర్జరీ తరువాత ఎన్నో సమస్యలు వచ్చాయి. ఆర్థరైటిస్ వచ్చింది. దానివలన విపరీతంగా లావు అయ్యాను. దాన్ని కరిగించడానికి నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయ్యింది. సర్జరీ వలన చాలా నొప్పి భరించాను. అక్కడ నొప్పి తట్టుకోలేకపోయేదాన్ని. అప్పుడంటే ఎవరు లేరు. ఇప్పుడు నా కుటుంబం నాకు తోడుగా ఉంది.

ఇక నా జీవితంలో నేను మూడుసార్లు చనిపోవాలనుకున్నాను. చిన్నప్పుడు నన్ను అందరూ ఊర్లో పలుపేర్లతో పిలిచేవారు. ఒకసారి మా నాన్న కూడా అలాగే పిలిచేసరికి తట్టుకోలేకపోయా.. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నా.. బాడీ మొత్తం 60% కాలిపోయింది. దాన్ని సరిచేయడానికి చాలా టైమ్ పట్టింది. ఆ తరువాత లవ్ బ్రేకప్ అయ్యినప్పుడు నిద్రమాత్రలు మింగాను. సర్జరీ అయ్యాక ఆర్థరైటిస్‌ వచ్చినప్పుడు ఆ బాధ భరించలేక మరోసారి నిద్రమాత్రలు మింగాను. అయినా సరే మళ్లీ బతికి బయటపడ్డాను. దేవుడు ఇన్నిసార్లు బతికిస్తున్నాడు అంటే.. నాకోసం ఏదో మంచిదే రాసిపెట్టాడు అని నమ్ముతున్నాను. మందు, సిగరెట్ ఒకప్పుడు అలవాటు.. ఇప్పుడు మానేశాను. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.