జీవితంలో ఓ లక్ష్యం అంటూ పెట్టుకుంటే ‘నెవ్వర్ గివ్ అప్’ అంటారు. అపజయానికి కృంగిపోకుండా ముందుకు సాగితేనే ఏదో ఒక రోజు విజయపు వాకిలి ఎదుట నిలువ గలుగుతాం. అందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే! తన 41 సంవత్సరాల వయసులో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కు తొలిసారి ఎంపికయ్యాడు ప్రవీణ్. ముంబైకి చెందిన ఈ క్రికెట్ జీవితం ఇప్పుడు సినిమాగా రూపుదిద్దుకుంది. చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే ఇష్టమున్నా ఇంటి సమస్యలు, వ్యక్తిగతమైన ఇబ్బందులతో ఉద్యోగంలో చేరి, పెళ్ళి చేసుకుని జీవితాన్ని సాగించాడు ప్రవీణ్. అయితే క్రికెట్ కు మాత్రం ఎప్పుడూ గుడ్ బై చెప్పలేదు. సెలక్షన్స్ కు వెళ్ళిన ప్రతిసారి అతని వయసును సాకుగా చూపించి వెనక్కి పంపేవాళ్ళు. ‘వయసు నాకు సమస్యే కాద’ని అతను ఎంత చెప్పినా వినేవాళ్ళు కాదు. రంజీ మ్యాచ్ ఆడాలని, ఇండియన్ క్రికెట్ టీమ్ లో చోటు దక్కించుకోవాలని అతను కన్న కలలు కాలంతో పాటు కరిగిపోయాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా క్రికెట్ నే నమ్ముకుని 2013లో తొలిసారి రాజస్థాన్ రాయల్స్ టీమ్ నుండి బరిలోకి దిగాడు. మూడు సీజన్స్ ఆ టీమ్ తో ఆడిన తర్వాత గుజరాత్ లయన్స్, కోల్ కటా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ తరఫున కూడా ఆడాడు. మొత్తం 33 ఆటల్లో 28 వికెట్స్ తీసుకున్నాడు. 4/20 అతని బెస్ట్ స్కోర్!
Read Also : RRR Celebration Anthem : “ఎత్తర జెండా” సాంగ్ ఎప్పుడంటే ?
ప్రవీణ్ తాంబే జీవితం తలుచుకుంటే ఇప్పటికే విడుదలైన ‘జెర్సీ’ మూవీ గుర్తొస్తుంది. అయితే ఆ కథకు ఈ కథకు పొంతన ఉండదు. వయసు మీద పడినా క్రికెట్ నే నమ్ముకున్న వ్యక్తి కథే ‘ప్రవీణ్ తాంబే ఎవరు?’. గురువారం ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ‘ఒప్పుకోవద్దురా ఓటమి… వదులుకోవద్దురా ఓరిమి’ అంటూ ఓ పాటలో స్వర్గీయ సీతారామశాస్త్రి రాసిన పదాలు ఈ మూవీ ట్రైలర్ చూస్తే గుర్తొస్తాయి. రాహుల్ ద్రావిడ్ మాటలతో మొదలైన ఈ ట్రైలర్ ను చూస్తుంటే… ఓ రకమైన ఉత్తేజం కలుగుతుంది. పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిదేమీ లేదనే నమ్మకం ఏర్పడుతుంది. ఇందులో ప్రవీణ్ తాంబేగా శ్రేయస్ తల్పాడే నటించాడు. ఇతర ప్రధాన పాత్రలను ఆశిష్ విద్యార్థి, అంజలీ పాటిల్, పరంవ్రత్ ఛటర్జీ తదితరులు పోషించారు. జయప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 1న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.