NTV Telugu Site icon

Pratap Pothen : ప్రముఖ నటుడు ప్రతాప్ పోతన్ కన్నుమూత

Pratp

Pratp

సీనియర్ నటుడు ప్రతాప్ పోతన్ ఈ రోజు ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా, రచయితగా చిత్ర పరిశ్రమలో కొనసాగారు ప్రతాప్ పోతన్ 1951లోతిరువనంతపురంలోజన్మించారు. నటి రాధిక ప్రతాప్ పోతన్ మొదటి భార్య. పెళ్ళైన సంవత్సారానికే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అమల సత్యనాధ్ ను పెళ్ళి చేసుకున్నారు ప్రతాప్ పోతన్. వీరికి ఓ కుమార్తె.

 

ఊటీలో చదువుకున్న ప్రతాప్ పోతన్ కు ఆరంభంలో పెయింటింగ్ పై మక్కువ ఉండేది. మద్రాస్ క్రిష్టియన్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ముంబైలో ఓ యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్ గా చేశారు ప్రతాప్. ఆరంభంలో స్టేజ్ షోస్ లో నటించేవారు ప్రతాప్ పోతన్. అది చూసిన భరతన్ తను తీసిన మలయాళ చిత్రం ‘ఆరవం’లో నటింప చేశారు. ఆ తర్వాత తమిళ చిత్రాల్లోనూ నటించటం మొదలు పెట్టాడు. 1980లలో ప్రతాప్ కెరీర్ పీక్స్ కి వెళ్ళింది. ‘నెంజిత్తై కిల్లాదే’ (మౌనగీతం)తో స్టార్ గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తెలుగు, కన్నడలోనూ నటించాడు. ‘ఆకలిరాజ్యం, కాంచనగంగ, జస్టిస్ చక్రవర్తి, పుష్పకవిమానం, చక్కల్లో చంద్రుడు, ‘మరోచరిత్ర’ (కొత్తది), వీడెవడు’ వంటి తెలుగు సినిమాల్లోనూ నటించాడు. అప్పట్లో తమిళ నటుడు మోహన్, ప్రతాప్ పోతన్ మధ్య గట్టి పోటీ ఉండేది. ఇటీవల విడుదలైన మమ్ముట్టి ‘సిబిఐ5’లోనూ ప్రతాప్ నటించాడు. దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించిన ప్రతాప్ పోతన్ 12 చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అందులో నాగార్జునతో తెలుగులో తీసిన ‘చైతన్య’ కూడా ఒకటి. తమిళంలో సత్యరాజ్, ప్రభు, కమల్ హాసన్, శివాజీగణేశన్ వంటి స్టార్స్ ని, మలయాళంలో మోహన్ లాల్ ని కూడా డైరెక్ట్ చేశారు ప్రతాప్ పోతన్. ప్రస్తుతం ప్రతాప్ పోతన్ నటిస్తున్న రెండు మలయాళ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోగా మోహన్ లాల్ డైరెక్ట్ చేస్తున్న ‘బారోజ్’ సినిమా షూటింగ్ లో ఉంది. ప్రతాప్ పోతన్ ఆకస్మిక మృతి పట్ల యావత్ చిత్రప్రపంచం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది.