NTV Telugu Site icon

Siva Nageswara rao: గీత రచయిత తనయుడు హీరోగా ‘దోచేవారెవరురా’!

Dochevarevarua

Dochevarevarua

ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ తనయుడు ప్రణవ చంద్ర ‘దోచేవారెవరురా’ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు .ఇప్పటికే పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ఉన్న ప్రణవ చంద్రను శివనాగేశ్వరరావు హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం విశేషం. బొడ్డు కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ ను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా జూన్ 4వ తేదీ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ళభరణి ‘సూళ్ళే బాకు..’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్, అజయ్ ఘోష్, సిరాశ్రీ, చైతన్య ప్రసాద్, బిత్తిరి సత్తి, సునయన, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ”సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడొచ్చు. ఈ సినిమా కోసం నేను రాసిన పాన్ గ్లోబ్ సాంగ్ లిరికల్ వీడియోను భరణి గారు ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ఒక సాంగ్, కొంత ప్యాచ్ వర్క్ మినహా సినిమా పూర్తయింది. జులై చివరి వారంలో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం” అని అన్నారు. ”ప్రస్తుత సమాజంలో మనం ఇంటి నుండి బయటికి వచ్చిన తరువాత మనల్ని రకరకాలుగా దోచుకుంటున్నారు. ఇంతకు ముందు ఎవర్ని దోచుకోవాలో సెలెక్ట్ చేసుకొని వారిని దోచుకొనే వారు. ప్రస్తుతం మనల్ని ఎవరు దోచుకోవాలో వారిని మనమే ఓటు వేసి సెలెక్ట్ చేసుకుంటున్నాం. అయితే ఇది పొలిటికల్ మూవీ కాదు. అన్ని రకాల ఎమోషన్స్ తో పాటు ఔట్ & ఔట్ కామెడీ థ్రిల్లర్ గా దీనిని తీశాం” అని చెప్పారు.

Dochevarevarura

Dochevarevarura

గీత రచయిత చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ, ”ఈ చిత్రంలో నా సాటి కవి, దర్శకుడు శివ నాగేశ్వరరావు రాసిన పాట చాలా బాగుంది. మారుతున్న తరానికి ప్రయోగాలు నచ్చుతాయి. మా అబ్బాయి ప్రణవ చంద్ర ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇంతకు ముందు ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమాలో చేశాడు. నా ఇద్దరు కొడుకులు దర్శకులు అవ్వాలని వర్క్ చేస్తున్నారు. ఐతే కో- డైరెక్టర్ గా చేస్తున్న ప్రణవ్ కు శివ నాగేశ్వరావు ఈ సినిమాలో హీరోగా చేసే అవకాశం ఇచ్చారు. మంచి కామెడీ తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి” అని అన్నారు.

హీరో ప్రణవ మాట్లాడుతూ, ”క్రిష్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేస్తున్న నాకు శివనాగేశ్వర రావు గారు తన సినిమాలో హీరోగా చేసే అవకాశమిచ్చారు. నా కో-ఆర్టిస్ట్ మాళవిక కూడా చాలా చక్కగా నటించింది. అజయ్ ఘోస్, బిత్తిరి సత్తి వంటి వారితో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. గీత రచయిత సిరాశ్రీ మాట్లాడుతూ, ”శివ నాగేశ్వరరావు తీసిన చాలా సినిమాలకు నేను నెగిటివ్ రివ్యూలు రాసినా దానిని స్పోర్టివ్ గా తీసుకొనే వాడు. అటువంటిది ఇప్పుడు తన సినిమాకు నేను పాటలు రాయడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి” అని అన్నారు.