Prakash Raj Sensational Comments On Actors: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో కలిసి నటించేందుకు కొందరు నటీనటులు వెనుకాడుతున్నారని బాంబ్ పేల్చారు. ఈమధ్య రాజకీయాల్లో తాను చూపిస్తున్న ఆసక్తే ఇందుకు కారణమని, అది తన సినీ కెరీర్‌పై ప్రభావం చూపుతోందని అనిపిస్తోందని పేర్కొన్నారు. ఓ ఇంగ్లీష్ ఛానెల్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ప్రస్తుతం రాజకీయ ప్రభావాన్ని ఎదుర్కుంటున్నా. ఒకప్పుడు నాతో కలిసి పని చేసిన వారు, ఇప్పుడు నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు. వాళ్లకు నాతో కలిసి నటించడమని ఎవ్వరూ చెప్పడం లేదు. కానీ, నా రాజకీయ వ్యవహారాలు వారిని భయపెడుతున్నాయి. నాతో పని చేస్తే.. వారిని యాక్సెప్ట్ చేయరేమోనన్న భయం వారికి పట్టుకుంది’’ అంటూ చెప్పుకొచ్చారు.
అలా భయంతో తనకు దూరం అవుతున్న వాళ్లను కోల్పోయేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని, ఈ విషయంలో తాను కొంచెం కూడా విచారించడం లేదని ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఇలాంటప్పుడు తాను భయపడితే.. అది వేరే వాళ్లకు శక్తిగా మారుతుందని, ఆ అవకాశం తాను ఇవ్వదలచుకోలేదని చెప్పారు. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవడానికైనా తాను రెడీగానే ఉన్నానని అన్నారు. నిజానికి.. ఇప్పుడే తాను మరింత స్వేచ్ఛగా భావిస్తున్నానని.. ఎందుకంటే, తాను తన స్వరాన్ని వినిపించకపోతే ఒక నటుడిగానే చనిపోతానని వెల్లడించారు. చాలామంది నటులు మౌనంగానే ఉంటున్నారని, అందుకు వారిని తాను నిందించాలని అనుకోవడం లేదన్నారు. ఒకవేళ వాళ్లు మాట్లాడినా, దాని వల్ల వచ్చే పరిణామాల్ని వాళ్లు తట్టుకోలేరన్నారు. అంటే.. రాజకీయాలు తీవ్రంగానే ప్రభావం చూపుతాయని ఆయన ఉద్దేశం.