‘బాహుబలి’ సీరీస్, ‘సాహో’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. అంతే కాదు తను చేసే ప్రతి సినిమాలో కొత్త కొత్త విషయాలను చూపిస్తూ ఇండియన్ సినిమాలో ఇంతకుముందు ఉపయోగించని కొత్త టెక్నాలజీతో ప్రయోగాలు చేస్తూ వెళుతున్నాడు.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా కోసం వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హేగ్డే హీరోయిన్. ఇక ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సాలార్’ను ‘డార్క్ సెంట్రిక్ థీమ్’ టెక్నాలజీ ఉపయోగించి చిత్రీకరిస్తున్నారు. సినిమా పలు సన్నివేశాలు చీకటి-షేడెడ్ విజువల్స్ తో ఉంటాయి. హాలీవుడ్ సినిమాలు ‘ది మ్యాట్రిక్స్, బ్యాట్ మేన్ ట్రైయాలజీ, టెనెట్’ వంటి సినిమాల కోసం ఈ సాంకేతికతనే ఉపయోగించారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సాలార్’ లో శృతి హాసన్ హీరోయిన్. అలాగే ప్రభాస్ మరో సినిమా ‘అదిపురుష్’ కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ పౌరాణిక చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ఇతర ప్రధాన పాత్రధారులు. దీనిని 3D లో విడుదల చేయనుండటం విశేషం. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల కానుంది.
ఇలా మూడు సినిమాల్లో మూడు రకాల సాంకేతికతలను పరిచయం చేయబోతున్నాడన్నమాట. వీటితో పాటు మరో భారీ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. వీటన్నింటితో ప్రభాస్ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుడుతాడని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో!?
