Posani : “ఆపరేషన్ అరుణారెడ్డి” మొదలెట్టిన పోసాని.. సీఎంగా రఘునందన్ రావు

Posani

Posani

సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వెర్సటైల్ యాక్టర్, రైటర్ అండ్ డైరెక్టర్ పోసాని కృష్ణమురళి సుదీర్ఘ గ్యాప్ అనంతరం మళ్లీ మెగా ఫోన్ పట్టారు. ఆయన స్వీయ దర్శకత్వంలో, ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న సరికొత్త చిత్రం “ఆపరేషన్ అరుణారెడ్డి”. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించిన పోసాని, మరోసారి తన మార్కు వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారారు. ఈ సినిమా కథాంశం గురించి పోసాని వివరిస్తూ.. “జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సమాజం ఎంత బాగుంటుంది అనేదే ఈ సినిమా సందేశం. సమాజంలో మార్పు తీసుకురావాలని తపించే ఒక సిన్సియర్ మహిళా జర్నలిస్ట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రజలు రాజకీయ నాయకులను ఎన్నుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజాసేవ చేసేవారెవరు? వ్యాపారం చేసేవారెవరు? అనే అంశాలపై ఇందులో స్పష్టమైన హెచ్చరికలు ఉంటాయి” అని తెలిపారు.

సాధారణంగా పోసాని సినిమాలంటే రాజకీయ విమర్శలు ఉంటాయనే అభిప్రాయం ఉంటుంది. అయితే దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా ఏ ఒక్క రాజకీయ పార్టీకో వ్యతిరేకం కాదు. అసభ్యకర దృశ్యాలు లేదా ‘బూతు’ డైలాగులు అస్సలు ఉండవు. టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ ఇలా అన్ని పార్టీల వారు కుటుంబంతో కలిసి చూడదగ్గ క్లీన్ ఫిల్మ్ ఇది అని అన్నారు. ఇక తన సుదీర్ఘ కెరీర్‌లో వందకు పైగా చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన అనుభవం తనకున్నదని గుర్తు చేస్తూ, “ఆపరేషన్ అరుణారెడ్డి స్క్రీన్ ప్లే భారతదేశంలోనే ఒక బెస్ట్ స్క్రీన్ ప్లేగా నిలుస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగుతుందని, ప్రేక్షకులు తదుపరి ఏం జరుగుతుందో ఊహించలేరని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, ఒక నిజాయితీ గల జర్నలిస్టుకు అండగా నిలిచే ముఖ్యమంత్రి పాత్రలో ఆయన నటించారు. కథ నచ్చడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పోసాని కృతజ్ఞతలు తెలిపారు.