Avika Gor: సాయి రోనక్, అవిక గోర్ జంటగా నటించిన చిత్రం ‘పాప్ కార్న్’. ఫిబ్రవరి 10వ తేదీ జనం ముందుకు రాబోతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ తమ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చిందని చిత్ర నిర్మాత మధుపల్లి భోగేంద్ర గుప్తా తెలిపారు. గతంలో ఈయన ‘నెపోలియన్, మా వూరి పొలిమేర’ చిత్రాలను నిర్మించారు. విశేషం ఏమంటే… ఈ చిత్రానికి హీరోయిన్ అవికా గోర్ తో పాటు ఎమ్మెస్ చలపతిరాజు, శేషుబాబు పెద్దింటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీతో యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంథం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు చక్కని స్పందన లభిస్తోందని నిర్మాత గుప్తా చెప్పారు. కథ గురించి వివరిస్తూ, ”ఓ షాపింగ్ మాల్ లిఫ్ట్ లో హీరో, హీరోయిన్లు చిక్కుకుపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ చిత్ర కథ. అవికా గోర్ ట్రెండీ, క్లాసీ లుక్స్ యూత్ ను ఆకట్టుకుంటాయి. అలానే సాయి రోనక్ తన పాత్రను ఎంతో చక్కగా పోషించాడు” అని అన్నారు. సినిమాలోని చివరి నలభై ఐదు నిమిషాలు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుందని, సీట్ ఎడ్జ్ మూమెంట్స్ ను పొందుతారని ఎమ్మెస్ చలపతి రాజు తెలిపారు. సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన అవికా గోర్ మాట్లాడుతూ .. ”ఇది ఒక డిఫరెంట్ మూవీ అని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఫిబ్రవరి 10న పాప్ కార్న్‌తో సందడి చేయబోతున్నాం” అని అన్నారు. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు.