బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో లాకప్. బాలీవుడ్ రియాలిటీ షోలన్నింటిలో ఈ షో ప్రధమ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద నటులనందరిని ఒకచోటకు చేర్చి .. వారి జీవితాల్లో జరిగిన రహస్యాలను బయటపెట్టడమే ఈ షో ఉద్దేశ్యం. ఇక ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్లు తమ జీవితంలో జరిగిన సీక్రెట్ లను బయట పెట్టి ప్రేక్షకులను షాక్ కి గురిచేశారు. ఇక మొదటి ఎపిసోడ్ నుంచి శృంగార తార పూనమ్ పాండే ఈ షో లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిందన్న విషయం తెల్సిందే. తన జీవితంలో గూడు కట్టుకుపోయిన రహస్యలన్నింటిని ఒక్కొక్కటిగా ఈ భామ చెప్పుకొస్తుంది. మొన్నటికి మొన్న తన భర్త తనను ఎంత వేధించాడో చెప్పి కంటతడి పెట్టించిన పూనమ్ మరోసారి తన గతంలోని చీకటి కోణాన్ని తెలిపి కంటనీరు పెట్టించింది. ఒకానొక సమయంలో తన తల్లిదండ్రులే తనను మెడ పట్టి బయటికి గెంటేసినట్లు చెప్పుకొచ్చింది.
” నాలుగేళ్ల క్రితం నేను అందరిలానే తల్లిదండ్రులతో కలిసి ఉన్నాను.. అయితే ఒకరోజు ఏమి జరిగిందో తెలియదు.. నాకు ఏ కారణం చెప్పకుండా నా తల్లిదండ్రులే నన్ను మెడపట్టుకొని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. కారణం ఏంటి అని నేను అడిగినా సమాధానం చెప్పకుండా ముఖం మీదే తలుపులు వేసుకున్నారు. నన్నెప్పుడు నా కుటుంబం సొంత మనిషిలా చూడలేదు.. డబ్బులు ఇచ్చే మెషీన్ లా మాత్రమే చూసింది. బయట నా గురించి చేదుగా మాట్లాడుతున్నారని, దాని వలన కుటుంబం పరువు పోతుందని భావించారే కానీ వారు నన్నెప్పుడు అర్ధం చేసుకోలేదు” అంటూ కన్నీటి పర్యంతమైంది. పూనమ్ మాటలకు మిగతా కంటెస్టెంట్లు కూడా కంటతడి పెట్టడం విశేషం. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ నెట్టింట వైరల్ గా మారింది.
