Pooja Hegde’s Tollywood Career at a Crossroads: ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా, అభిమానులు ప్రేమగా ‘బుట్టబొమ్మ’గా పిలిచే పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి అగ్రహీరోల సరసన నటించి వరుస విజయాలు అందుకున్న పూజా.. గత కొన్నేళ్లుగా మాత్రం తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. కొన్నాళ్లుగా హిందీ, తమిళ్ సినిమాలతోనే అమ్మడు కెరీర్ నెట్టుకొస్తుంది. పూజా తెలుగు సినిమాలకు దూరమవడానికి కారణం లేకపోలేదు.
భారీ పారితోషికం:
ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. పూజా హెగ్డే చెప్పే పారితోషికం విని నిర్మాతలు, దర్శకులు వెనక్కి తగ్గుతున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే బడ్జెట్‌తో యువ హీరోయిన్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉండటంతో నిర్మాతలు కొత్త ముఖాల వైపు మొగ్గు చూపుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. పూజా నటించిన కొన్ని లేటెస్ట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ఒకప్పుడు హిట్ గ్యారంటీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆమెకు ఇటీవల వచ్చిన ఫలితాలు ఆశించినంతగా లేకపోవడం కెరీర్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ల మార్కెట్‌లో విజయాలు కీలకంగా మారిన నేపథ్యంలో ఈ అంశం కూడా అవకాశాలు తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు.
పూజా.. తగ్గాల్సిందే:
ఇటీవల టాలీవుడ్‌లోకి అనేక మంది యువ హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు. తక్కువ రెమ్యునరేషన్‌తో పాటు కొత్తదనాన్ని అందించగల నటీమణులకు నిర్మాతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఇప్పటికే స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ పూజా హెగ్డేకు అవకాశాలు తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అవకాశాలు తగ్గుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. పూజా మాత్రం తన రెమ్యునరేషన్ విషయంలో రాజీ పడటం లేదని సమాచారం. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పారితోషికాన్ని తగ్గిస్తే టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు:
తెలుగులో అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ పూజా హెగ్డే చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘జన నాయకగన్’, రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కాంచన 4’ చిత్రాలతో పాటు దుల్కర్ సల్మాన్‌తో ఓ ప్రాజెక్ట్‌లో కూడా ఆమె నటిస్తోంది. ఈ సినిమాలు విజయవంతమైతే పూజా మరోసారి టాలీవుడ్‌లో బలమైన కంబ్యాక్ ఇవ్వగలదా? అనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అభిమానులు కూడా ఆమె మళ్లీ తెలుగు తెరపై మెరవాలని ఆశిస్తున్నారు. చూడాలి మరి టాలీవుడ్ కెరీర్ ఎలా ఉంటుందో.

