Police to do Narcotics test to Director Krish: గచ్చిబౌలి డ్రగ్స్ కేసు మీద పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంజీరా గ్రూప్ అధినేత గజ్జల వివేకానందకు సయ్యద్ అబ్బాస్ అలీ పదిసార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక తాజాగా సయ్యద్ అబ్బాస్ అలీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు అదే సమయంలో సయ్యద్ అబ్బాస్ అలీ, వివేకానంద, కేదార్ లకు చెందిన మూడు సెల్ ఫోన్లు సైతం సీజ్ చేశారు. ఇక ఆ ముగ్గురు సెల్ ఫోన్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించిన పోలీసులు సెల్ ఫోన్ లో డేటాను,మెసేజ్ లు, వాట్సాప్ చాట్ ని రిట్రీవ్ చేయాలని చూస్తున్నారు. రిట్రీవ్ చేస్తే కనుక మరింత సమాచారం పోలీసులకి అందనుంది.
Gachibowli Drugs Case: గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు..
ఇక కేదార్ కి చెందిన పబ్బుల్లో కూడా డ్రగ్స్ పార్టీలు జరిగినట్టు గచ్చిబౌలి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక పోలీసుల విచారణలో డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్టు తేలిందని దీంతో క్రిష్ ను పిలిచి డ్రగ్స్ పరీక్షలు చేయిస్తామని అంటున్నారు. అంతేకాదు ఈ కేసు ఎఫ్ఐఆర్ లో క్రిష్ పేరును గచ్చిబౌలి పోలీసులు చేర్చారు. పార్టీ జరుగుతున్న సమయంలో క్రిష్ రాడిసన్ హోటల్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీ జరుగుతున్న రూమ్లో అరగంట పాటు కూర్చున్నారని, రాడిసన్ యజమాని వివేకానందతో ఆయన మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసుపై ఎన్టీవీతో క్రిష్ మాట్లాడుతూ తాను హోటల్ కు వెళ్లడం నిజమే అని, సాయంత్రం ఒక అరగంట మాత్రం నేను అక్కడ ఉన్నాను అని, కేవలం ఫ్రెండ్స్ ను కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లానని అన్నారు. సాయంత్రం ఆరు గంటల 45 నిమిషాలకు తాను హోటల్ నుంచి బయటకు వచ్చేసానని, హోటల్ యజమాని వివేకనందతో అప్పుడే పరిచయం ఏర్పడిందని తెలిపాడు. తన డ్రైవర్ లేకపోవడంతో వివేకనందతో అరగంట పాటు మాట్లాడానని, డ్రైవర్ రాగానే పార్టీ నుంచి వెనక్కి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చాడు.
