బస్తీలో ఉంటూ చదువు, బతుకు కోసం అహర్నిశలు పోరాడే ఇద్దరు అమాయక యువకులు.. సడెన్‌గా శ్రీలంక వెళ్లి ఇంటర్నేషనల్ గ్యాంబ్లింగ్ (జూదం) ఊబిలో దిగితే ఎలా ఉంటుంది? అసలు వాళ్లను దేశం దాటించి అక్కడికి పంపిన ఆ అందమైన అమ్మాయి వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? విదేశాల్లో చదువుకోవాలనే కలను నిజం చేసుకోవడానికి ఆ కుర్రాళ్లు ఎంచుకున్న ఈ ప్రమాదకరమైన మార్గం వారి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పింది? ఇలాంటి సంచలన మరియు ఆసక్తికరమైన కథాంశంతో వస్తున్న పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. మెగా డాటర్ నిహారిక కొణిదెల తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’, మరియు ‘మాగ్జిమం సిటీ స్టూడియోస్’ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ డార్క్ అండ్ గ్యాంబ్లింగ్ డ్రామాకు రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ది ఫస్ట్ హ్యాండ్’ పేరుతో విడుదలైన టీజర్ నెట్టింట సంచలనంగా మారి, సినిమాపై క్యూరియాసిటీని అమాంతం పెంచేస్తోంది. టీజర్ ప్రారంభంలోనే శ్రీలంకలోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. “ఈ ఫీలింగ్ ఏంట్రా ఇలా ఉంది.. కల కంటే రియాలిటీనే ఫస్ట్ టైమ్ బావుంది” అని హీరో చెప్పే డైలాగ్.. ఆ కుర్రాళ్ల డ్రీమ్స్‌ను కళ్లకు కడుతుంది. దానికి తోడు “డోంట్ టాక్ టు మీ తెలుగు లైక్ లోకల్ బస్తీ గయ్స్.. ఐయామ్ ది ఓనర్ ఆఫ్..” అంటూ వచ్చే కౌంటర్ డైలాగ్స్ వారి బస్తీ నేపథ్యాన్ని, సడెన్‌గా గ్యాంబ్లింగ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చి ఓనర్ల రేంజ్‌కు ఎదిగిన తీరును స్పష్టం చేస్తున్నాయి.
ముఖ్యంగా పూట గడవడానికే కష్టపడే ఈ కుర్రాళ్ల జీవితాల్లోకి ఓ అందమైన అమ్మాయి (శ్రియా కొంతం) ఎంట్రీ ఇవ్వడం, ఆమె వారిద్దరినీ ఒక ప్లాన్ ప్రకారం శ్రీలంక పంపించడం ఈ కథలో అసలైన ట్విస్ట్. అక్కడ గ్యాంబ్లింగ్ మాఫియాలో అత్యంత కీలకమైన పాత్రలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి ఎంట్రీ ఇవ్వడం టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. విదేశీ చదువుల కోసం వెళ్లిన కుర్రాళ్లు.. జేడీ చక్రవర్తి గ్యాంగ్‌తో ఎలా డీల్ చేశారు? ఆ అమ్మాయి ఆడిన అసలు గేమ్ ఏంటి? అనేది వెండితెరపైనే చూడాలి. ‘కమిటీ కుర్రోళ్ళు’ ఫేమ్ త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ ఇందులో హీరోలుగా నటిస్తుండగా, ‘శుభం’ ఫేమ్ శ్రియా కొంతం హీరోయిన్‌గా అలరించనుంది. జేడీ చక్రవర్తితో పాటు శ్రీనివాస్ అవసరాల, కిరీటి దామరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి ఈ చిత్రానికి నిర్మాతలు. గ్యానీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎదురోలు రాజు కెమెరా వర్క్ టీజర్‌ను మరింత గ్రిప్పింగ్‌గా మార్చాయి. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘పాకెట్ రాకెట్స్’ అతి త్వరలోనే థియేటర్లలో పేలడానికి సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

