NTV Telugu Site icon

R Narayana Murthy: ఎన్నేళ్లు అయినా పీపుల్స్ స్టార్ ఒక్కడే ఉన్నాడు… ఒక్కడే ఉంటాడు…

R Nayanaramurthy

R Nayanaramurthy

ప్రపంచంలో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా హిట్ కొట్టిన ప్రతి ఒక్క హీరో పేరుకి ముందు ‘స్టార్’ ట్యాగ్ వచ్చి చేరుతుంది. సూపర్ స్టార్, మెగాస్టార్, మాస్ స్టార్, బాక్సాఫీస్ కింగ్… ఇలా ఎదో ఒక ట్యాగ్, హీరో పేరుకి ముందు తప్పకుండ ఉంటుంది. అయితే ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా, ఎంతమంది సూపర్ స్టార్ లు పుట్టుకొచ్చినా ‘పీపుల్స్ స్టార్’ మాత్రం ఒక్కడే ఉన్నాడు, ఇకపై కూడా ఒక్కడే ఉంటాడు.. ఆయనే ‘ఆర్.నారాయణమూర్తి’. ప్రేక్షకుల నుంచి, ప్రేక్షకుల కోసం, ప్రేక్షకులతో సినిమాలు చేశాడు కాబట్టే ‘ఆర్. నారాయణమూర్తి’ పీపుల్స్ స్టార్ అయ్యాడు. ఒక వర్గం ఆడియన్స్ ఈయన్ని ఓన్ చేసుకునంత మరే హీరోని ఓన్ చేసుకోలేకపోయారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. సినీ ప్రయాణం మొదలు పెట్టి నలబై ఏళ్లు అయినా, ఎన్నో హిట్ సినిమాలని ఇచ్చినా, కోట్లు ఇస్తామని ప్రొడ్యూసర్లు వెంట పడినా, చిన్న గెస్ట్ రోల్ అయినా చెయ్యమని దర్శకులు బ్రతిమాలిన… తనకి డబ్బులు ముఖ్యం కాదు అని చెప్పి కేవలం తను నమ్మిన సిద్ధాంతాలతోనే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ‘ఆర్. నారాయణమూర్తి’.

ఒకే నిజాన్ని నమ్మి, ఒకే సిద్ధాంతాన్ని కథాంశంగా చేసుకోని సినిమాలు చెయ్యడం బహుశా ‘ఆర్.నారాయణ ‘మూర్తి’కి మాత్రమే చెల్లిందేమో. అర్ధరాత్రి స్వాతంత్రం,  భూపోరాటం, లాల్ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, ఒరేయ్ రిక్షా, ఎర్రోడు, దళం, చీకటి సూర్యులు, ఛలో అసెంబ్లీ, వేగు చుక్కలు, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య, పోరు తెలంగాణా, వీర తెలంగాణా, పీపుల్ వార్ లాంటి సూపర్ హిట్ సినిమాలని చేశాడు ఆర్.నారాయణమూర్తి. ఈ సినిమాలు అన్నీ ప్రజల సమస్యలని కథాంశంగా చేసుకోని రూపొందిన చిత్రాలే. 2018లో చివరగా ‘అన్నదాత సుఖీభవ’ సినిమాలో నటించిన ‘ఆర్ .నారాయణ మూర్తి’ గత నాలుగేళ్ళుగా సినిమాలు చెయ్యట్లేదు. ప్రజలతో మమేకం అయ్యి ఉండడం ఇష్టమైన వాడు కాబట్టే ఇప్పటికీ ‘ఆర్.నారాయణమూర్తి’ బస్సులోనో, ఆటో లోనో తిరుగుతూ… ఏ పార్క్ లోని చెట్టు కిందనో పడుకోని అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. ఇలాంటి హీరో, ఇలాంటి ప్రజా పోరాటాన్ని ప్రభావితం చేసిన దర్శకుడు భారతీయ సినీ చరిత్రలో మరొకరు లేరు, రారు అని చెప్పడం సమంజసంగానే ఉంటుంది. ఆయన పుట్టిన రోజు సంధర్భంగా సోషల్ మీడియాలో ప్రముఖులు ‘ఆర్. నారాయణ మూర్తి’కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.