NTV Telugu Site icon

Pawan Kalyan: ఆ రీమేక్ రద్దయ్యిందా..? ఇదిగోండి క్లారిటీ!

Pk Vinodhaya Sitham

Pk Vinodhaya Sitham

Pawan Kalyan Vinodhaya Sitham Remake Not Shelved: ఈ ఏడాది భీమ్లా నాయక్‌తో అలరించిన పవన్ కళ్యాణ్.. వరుసగా కొన్ని క్రేజీ ప్రాజెక్టులకు లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే! వాటిల్లో రీమేక్స్‌ కూడా ఉన్నాయి. ఆ రీమేక్స్‌లో వినోదయ సీతమ్ ఒకటి. తమిళంలో ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన సముద్రఖనినే.. తెలుగు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. ఈపాటికే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లాల్సింది. కానీ, అది కుదరలేదు. పైగా, కొంతకాలం నుంచి ఈ సినిమా గురించి ఎలాంటి వార్తలూ రాలేదు. ఈ నేపథ్యంలోనే.. ‘వినోదయ సీతమ్’ రీమేక్ రద్దయ్యిందనే ప్రచారం ఊపందుకుంది. రాజకీయాలతో పాటు ఇతర సినిమాలతోనూ బిజీగా ఉండటంతో, ఆ సినిమాని పవన్ పక్కన పెట్టేశాడన్న రూమర్స్ వచ్చాయి.

అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘వినోదయ సీతమ్’ రీమేక్ రద్దు కాలేదట! ఇది తప్పకుండా రూపొందుతుందని వార్తలొస్తున్నాయి. ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ముగించుకున్న తర్వాత.. అతి తక్కువ కాలంలోనే ఆ సినిమా రీమేక్ చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడట! అందుకు బల్క్ డేట్స్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది. ఆ సినిమా కోసం ఎక్కువ రోజులు కేటాయించాల్సిన అవసరం లేదు. అందుకే, ఒకసారి సెట్స్ మీదకి తీసుకెళ్లాక, పూర్తయ్యేదాకా వేరే ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టకూడదని పవన్ డిసైడ్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. కాగా.. పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా కూడా చేయనున్న సంగతి తెలిసిందే! కాకపోతే, ఇది ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్లనుందన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.