NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణం.. దద్దరిల్లిన వేదిక

Pawan Kalyan Ane Nenu

Pawan Kalyan Ane Nenu

Pawan Kalyan Takes Oath As AP Minister: మెగా అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా కంటున్న కల నిజమైంది. ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. 2014వ సంవత్సరంలో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ అప్పుడు తెలుగుదేశం బీజేపీ కూటమికి కేవలం మద్దతు తెలిపి పోటీకి దూరంగా ఉన్నారు. అయితే 2019వ సంవత్సరంలో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ, తెలుగుదేశం రెండిటికి దూరమై ఒంటరిగా పోటీ చేసి 175 స్థానాలలో కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. స్వయంగా తాను పోటీ చేసిన రెండు స్థానాల నుంచి కూడా ఘోర పరాజయం పాలయ్యాడు. అయితే 2019 ఎన్నికల తర్వాత మరోసారి బిజెపితో పొత్తు లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలకు ముందు నాటకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం, బిజెపి, జనసేన కూటమి ఏర్పడడానికి కారణమయ్యారు.

Chandrababu Naidu Oath Ceremony Live Updates: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. లైవ్ అప్‌డేట్స్

ఇక ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి సుమారు 70,000 మెజారిటీ తెచ్చుకుని అక్కడ వైసీపీ అభ్యర్థి వంగా గీత మీద గెలుపొందారు. ఇక ఈరోజు ఏపీ తదుపరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ కూడా ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోపక్క హోమ్ మినిస్టర్ పదవి కూడా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది కానీ ఇప్పటివరకు అటు జనసేన నుంచి కానీ ఇటు తెలుగుదేశం నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం మొదలు పెట్టిన వెంటనే వేదిక సహా అక్కడి పరిసర ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అశేష జనవాహిని నుంచి ఆయనకు విశేష స్పందన లభించడం గమనార్హం.