Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎ. ఎం. రత్నం సమర్ఫణలో ఆయన సోదరుడు దయాకర్ రావు నిర్మిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిష్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. నిధి అగర్వాల్ నాయికగా నటిస్తోంది. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. అయితే దానికి అనుగుణంగా ప్రతి అంశంపైనా నటీనటులు, సాంకేతిక నిపుణులకు క్లారిటీ ఉండటంకోసం శుక్రవారం నుండి హైదరాబాద్ లో వర్క్ షాప్ ను ప్రారంభించారు.
తొలి రోజునే కాకుండా మలి రోజు కూడా పవన్ కళ్యాణ్ ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. రచయితలతోనూ, ఇతర సాంకేతిక నిపుణులతో చర్చలు జరిపారు. కొన్ని యాక్షన్ సీన్స్ కు సంబంధించి ప్రాక్టీస్ కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫోటోస్ ను చిత్ర బృందం మీడియాకు విడుదల చేసింది. గతంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొన్నదే లేదు. కానీ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అయిన క్రిష్ కోసం ఆయన ఈ విధంగా చేయడం విశేషం.
