Site icon NTV Telugu

Sarkaru Vaari Paata: ఈ మార్పులు చేసుంటే.. మరో వంద కోట్లు వచ్చేవి

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. రూ. 200 కోట్ల పైచిలుకు వసూళ్లను రాబట్టింది. అయితే.. ఇందులో మరికొన్ని మార్పులు చేసి ఉంటే, మరింత పెద్ద హిట్ అయ్యేదని ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. ‘పరుచూరి పాఠాలు’ పేరుతో కొత్త చిత్రాలపై తన అభిప్రాయాల్ని వెల్లడిస్తోన్న ఈయన.. తాజాగా సర్కారు వారి పాటలోని తప్పుల్ని ఎత్తిచూపారు.

‘సర్కారు వారి పాట’ ప్రథమార్థంలో మహేశ్, కీర్తిల మధ్య సాగిన హాస్యభరిత సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా అలరించాయని గోపాలకృష్ణ అన్నారు. అయితే.. అలా సరదాగా సాగుతున్న కథనం ఒక్కసారిగా సీరియస్‌గా మారిపోయి, మహేశ్ ఇండియాకి పయనమవ్వడమనేది ఒక ప్రమాదకరమైన మలుపు అని ఆయన అభిప్రాయపడ్డారు. కథనాన్ని హఠాత్తుగా సీరియస్ మూడ్‌లోకి తీసుకెళ్లకుండా.. కీర్తి, మహేశ్ మధ్య సరదా సీన్లను ఇంకాసేపు కొనసాగించి ఉంటే సినిమా మరింత పెద్ద హిట్టయ్యేదన్నారు. కామెడీతో పాటు సీరియస్ రొమాన్స్‌ని పొడిగించి ఉంటే.. ఈ చిత్రం మరో రూ. 100 కోట్లు వసూలు చేసేదన్నారు.

కానీ.. అలా కాకుండా కథనం హఠాత్తుగా సీరియస్‌గా మారిపోవడం, హీరోకి – విలన్‌కి మధ్య జరిగే సన్నివేశాలనే ఎక్కువసేపు చూపించడంతో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారని తెలిపారు. సడెన్‌గా కథనం మార్పు చెందడమే ఈ సినిమాకి కాస్త ప్రతికూలతగా మారిందని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఏదేమైనా.. సినిమా మాత్రం భారీ కలెక్షన్లు కొల్లగొట్టి, హిట్ జాబితాలోకి అయితే చేరింది.

Exit mobile version