త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు రామ్ చరణ్. సినిమాలతో పాటు పలు బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న చెర్రీ బ్రాండ్ విలువ ఈ సినిమా తర్వాత మరింత పెరగటం ఖాయం. అయితే ఈ సినిమా విడుదలకు ముందే తాజాగా మరో బ్రాండ్ ని ఖాతాలో వేసుకున్నాడు చరణ్. అదే శీతల పానీయం ‘ప్రూటీ’. అయతే ప్రూటీకి ఇప్పటి వరకూ అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ‘పుష్ప’ ఘన విజయంతో బన్నీ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న పలు సంస్థలు ఫుల్ ఖుషీగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పటివరకూ దక్షిణాదికి ప్రూటీకి అంబాసిడర్ గా ఉన్న అల్లు అర్జున్ ని కాదని రామ్ చరణ్ తో ఫ్రూటీ ప్రచారం ఆరంభించటం విశేషం. అందుకు చరణ్, అలియా భట్ జంట ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తుండటంతో ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే తాపత్రయంగానే భావించవచ్చు. ఇటీవల ముంబైలో ఈ ప్రచారానికి సంబంధించి ప్రకటన కూడా చిత్రీకరించారు. సో ఈ వేసవి నుంచి చరణ్, అలియా ముఖచిత్రం ప్రూటీ బాటిల్స్ పై కనిపిస్తుందన్నమాట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రూటీ ప్రచారానికి సంబంధించిన పిక్స్ వైలర్ అవుతున్నాయి. వాణిజ్య ప్రకటన కూడా మరికొన్నిరోజుల్లో రిలీజ్ కానుంది. ఫ్రూటీతో పాటు మరి కొన్ని బ్రాండ్ లకు కూడా చరణ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వినికిడి. గతేడాది నుంచి హాట్ స్టార్ తెలుగు వెర్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఉత్తరాదిలో ఫ్రూటీ యాడ్ ను వరుణ్ ధావన్, ఆలియా ప్రమోట్ చేస్తున్నారు.
Read Also : Radhe Shyam Pre Release Event : ప్రభాస్ కోసం షూటింగ్ కు స్టార్ హీరో డుమ్మా
మెగాహీరోల మధ్య గ్యాప్ పెరిగిందని సోషల్ మీడియా కోడై కూస్తున్న సమయంలో బన్నీ యాడ్ చరణ్ చేతికి రావటం ఆ గ్యాప్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే ‘పుష్ప’ తర్వాత బన్నీ ప్యాన్ ఇండియా స్టార్ గా మరింత ఇమేజ్ ని పెంచుకోవడంతో పలు యాడ్ సంస్థలు బన్నీ వెంట పడుతున్నట్లు సమాచారం. బన్నీ ప్రస్తుతం తన దృష్టిని ‘పుష్ప2’పై పెట్టాడు. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తాడు. దీనిని పాన్ ఇండియా స్థాయిలో తీయబోతున్నట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ మరింత దూకుడు పెంచుతాడని అంటున్నారు. మరి రానున్న రోజుల్లో బన్నీ, చరణ్ లో ఎవరు పైచేయి అనిపించుకుంటారో చూడాలి.
