Romantic Drama : ఒక సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం ఒక విజయమైతే, అదే సినిమా ఓటీటీలో కొత్త ప్రేక్షకులను సంపాదించుకుని మరోసారి చర్చనీయాంశంగా మారడం మరింత పెద్ద విజయం. ప్రస్తుతం అలాంటి అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంటున్న సినిమా ‘డ్రింకర్ సాయి’ (Drinker Sai). ఈ తెలుగు రొమాంటిక్ డ్రామా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణకు దీనికి ఐయండిబిలో 8.7 రేటింగ్ కూడా లభించింది. దీంతో ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ గా కూడా తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది.
జీ5 (Zee5)లో స్ట్రీమింగ్
ధర్మ మహేష్ హీరోగా నటించిన డ్రింకర్ సాయి సినిమాకు బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్ లైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించిన ఈ చిత్రానికి తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. 2024 డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ముఖ్యంగా యువతను, మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో ధర్మ మహేష్‌కు నటుడిగా ప్రత్యేక గుర్తింపు లభించడమే కాకుండా, దుబాయ్‌లో జరిగిన గామా అవార్డ్స్‌లో బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డు కూడా దక్కడం విశేషం. హీరోయిన్ ఐశ్వర్య శర్మ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది ఇందులో. రీతూ చౌదరి, పోసాని కృష్ణ మురళీ, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, కిర్రాక్ సీత, ఫన్ బకెట్ రాజేష్, రాజ ప్రజ్వల్ తదితరులు కూడా ఇందులో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా మే 27 నుంచి జీ5 ఓటీటీలో టాప్ వన్ ట్రెండింగ్ స్థానాన్ని దక్కించుకుని దూసుకుపోతోంది. థియేటర్లలో ప్రారంభమైన విజయయాత్ర ఇప్పుడు ఓటీటీలో కొనసాగుతుండటంతో, ఇంకా చూడని ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
‘డ్రింకర్ సాయి’ సినిమా కథ
డ్రింకర్ సాయి’ సినిమాలో హీరో సాయి (ధర్మ) కోట్లాది రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ, గతంలో జరిగిన ఒక ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోవడంతో అతిగా మద్యానికి బానిస అవుతాడు. ఎప్పుడూ చేతిలో మద్యం సీసాతో తిరుగుతూ ఒక రౌడీలా ప్రవర్తిస్తుంటాడు. ఇదే సమయంలో అతనికి మెడికల్ స్టూడెంట్ అయిన భాగీ (ఐశ్వర్య శర్మ)తో పరిచయమవుతుంది. మొదట సాయి ప్రవర్తనను, అతని తాగుడు అలవాటును చూసి భాగీ తీవ్రంగా అసహ్యించుకుంటుంది. అయితే సాయి మాత్రం ఆమె ప్రేమను ఎలాగైనా దక్కించుకోవాలని వెంటపడతాడు. అయితే సాయి కేవలం పైపైన తాగుబోతులా కనిపిస్తున్నాడే తప్ప అతని మనసు చాలా మంచిదని, అతని తాగుడు వెనుక ఒక బలమైన కారణం ఉందని భాగీ రాను రాను గ్రహిస్తుంది. అతనిలోని నిజమైన ప్రేమను చూసి ఆమె మనసు మారుతుంది. చివరికి భాగీ ప్రేమ సాయి జీవితాన్ని ఎలా మార్చింది ? అతను తన వ్యసనాన్ని వదిలించుకుని ఒక బాధ్యతగల మనిషిగా ఎలా మారాడు ? సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇచ్చాడు ? అనేదే ఈ సినిమా అసలు కథ.
