ప్రస్తుతం భారతీయ దర్శకుల్లో మన తెలుగువాడయిన ఎస్.ఎస్.రాజమౌళి పేరు మారుమోగి పోతోంది. తన తాజా చిత్రం ‘ట్రిపుల్ ఆర్’తో రాజమౌళి మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటి దాకా ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.1084 కోట్లు పోగేసింది. భారతదేశంలో విడుదలైన అన్ని భాషల్లో కలిపి ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం రూ. 880.4 కోట్లు మూటకట్టింది. ఇక విదేశాలలో ఈ సినిమా రూ.203.6 కోట్లు రాబట్టింది. వెరసి మొత్తం రూ.1084 కోట్లు కొల్లగొట్టి, ఈ యేడాది ఇప్పటిదాకా అత్యధిక వసూళ్ళు చూసిన చిత్రంగా నిలచింది.
‘ట్రిపుల్ ఆర్’ వేయి కోట్లకు పైగా వసూళ్ళు చూడడంతో దర్శకుడు రాజమౌళికి ఓ అరుదైన రికార్డు సొంతమయింది. గతంలో ఆయన తెరకెక్కించిన ‘బాహుబలి-2’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా మూటకట్టింది. ఇప్పటికీ మన భారతదేశంలో అత్యధిక వసూళ్లు చూసిన చిత్రంగా ‘బాహుబలి-ద కంక్లూజన్’ నిలచే ఉంది. ఈ సినిమాను బీట్ చేసిందంటూ అప్పట్లో ‘దంగల్’ సినిమా అక్కడా ఇక్కడా, చైనాలో కలిపి రూ.2000 కోట్లకు పైగా రాబట్టిందని ప్రచారం చేశారు. అయితే ఇప్పటికీ అసలైన వసూళ్ళలో ‘బాహుబలి-2’దే పైచేయి అని ఉత్తరాదివారే అంగీకరిస్తున్నారు. అది అలా ఉంచితే, ఓ దర్శకుడు తెరకెక్కించిన రెండు చిత్రాలు వరుసగా వేయి కోట్లకు పైగా వసూలు చేయడం అన్న రికార్డ్ రాజమౌళికే దక్కింది. మరి రాబోయే చిత్రాలతోనూ రాజమౌళి ఇదే మ్యాజిక్ చేస్తే, ఆయనను అధిగమించే దర్శకుడు ఇప్పట్లో కనిపించడు అనే చెప్పాలి.
