Okkadu Film Completes 20 Years: నేడు ‘సూపర్ స్టార్’ గా జేజేలు అందుకుంటున్న మహేశ్ బాబును మాస్ హీరోగా జయకేతనం ఎగురవేసేలా చేసిన చిత్రం ‘ఒక్కడు’. సరిగా ఇరవై ఏళ్ళ క్రితం జనవరి 15న ‘ఒక్కడు’ సినిమా సంక్రాంతి బరిలో దూకి పందెం కోడిగా గెలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఎమ్మెస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేశ్ సరసన భూమిక నాయికగా నటించిన ‘ఒక్కడు’ 2003 జనవరి 15వ తేదీన విడుదలై విజయఢంకా మోగించింది.
‘ఒక్కడు’ కథ ఏమిటంటే – కబడ్డీ పోటీలకు కర్నూల్ వెళ్ళిన అజయ్, అక్కడ స్వప్న అనే అమ్మాయిని రక్షించడానికి ఓబుల్ రెడ్డి అనే వ్యక్తిని కొడతాడు. ఆ అమ్మాయి ఎవరో తెలియకున్నా, మానవతాదృష్టితో రక్షిస్తాడు. తన ఇంటికి తీసుకు వచ్చి ఆమెకు ఆశ్రయమిస్తాడు. ఆ ఓబుల్ రెడ్డి రాష్ట్ర హోమ్ మంత్రి తమ్ముడు అని తరువాత తెలుస్తుంది. ఆ అమ్మాయి పేరు స్వప్న. ఆమె అన్నలను చంపిన ఓబుల్ రెడ్డి, ఆమెను పెళ్ళాడాలని చూస్తుంటాడు. అతని బారి నుండి తప్పించుకొనే ప్రయత్నంలోనే అజయ్ ఆశ్రయం పొందుతుందామె. అజయ్ అభిమానం చూసి అతడిని స్వప్న ప్రేమిస్తుంది. అజయ్ తండ్రి హైదరాబాద్ లో డీసీపీగా పనిచేసే విజయ్ వర్మ. అతనికి తమ ఇంట్లోనే రహస్యంగా అజయ్, స్వప్నను దాచాడని తెలుస్తుంది. మొత్తానికి పలు పాట్లు పడి ఆమెను అమెరికా పంపే ప్రయత్నం చేస్తాడు అజయ్. ఓబుల్ రెడ్డి, స్వప్నను వెదుక్కుంటూ వస్తాడు. చివరకు ఎయిర్ పోర్ట్ దగ్గర అజయ్ ని అరెస్ట్ చేసి, స్వప్నను ఓబుల్ రెడ్డికి అప్పగిస్తారు పోలీసులు. స్వప్నను తీసుకు వెళ్ళి బలవంతంగా పెళ్ళాడాలని చూస్తాడు ఓబుల్ రెడ్డి. అప్పుడు ఆమె అతనికి ఓ సవాల్ విసరుతుంది. దమ్ముంటే అజయ్ ని కొట్టి తన మెడలో తాళి కట్టమంటుంది. దానిని స్వీకరించిన ఓబుల్ రెడ్డి, అజయ్ ను చంపాలని చూస్తాడు. అయితే, అజయ్ ఓ పథకం ప్రకారం ఓబుల్ రెడ్డినే కిడ్నాప్ చేస్తాడు. చివరకు కబడ్డీ పోటీలో గెలుస్తాడు అజయ్. అయితే ఓబుల్ రెడ్డి తప్పించుకొని, అజయ్ ని చంపాలనుకుంటాడు. ఇద్దరూ హోరాహోరీగా పోరాడతారు. చివరకు అజయ్ పైచేయి సాధిస్తాడు. స్వప్న, అజయ్ ఒకరినొకరు ఆనందంతో ఆలింగనం చేసుకున్న సమయంలో అజయ్ ను చంపాలని చూసిన ఓబుల్ రెడ్డిని, స్వప్న తండ్రి వెనుకనుండి వచ్చి పొడిచి చంపేస్తాడు. ఓబుల్ రెడ్డి అన్న హోమ్ మినిస్టర్ మండిపడ్డా, అతని సెక్రటరీ సూచనతో నెమ్మదిస్తాడు. అజయ్, స్వప్న పెళ్ళాడడంతో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, ముకేశ్ రుషి, చంద్రమోహన్, రాజన్ పి.దేవ్, గీత, తెలంగాణ శకుంతల, పరుచూరి వెంకటేశ్వరరావు, నిహారిక, అజయ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అచ్యుత్, ఎమ్మెస్ నారాయణ, గుండు హనుమంతరావు తదితరులు నటించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం గుణశేఖర్ సమకూర్చగా, పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. మణిశర్మ బాణీలకు సీతారామశాస్త్రి పాటలు తోడయ్యాయి. ఇందులోని “హరే రామా… రామారామా…”, “నువ్వేం మాయ చేశావో కానీ…”, “చెప్పవే చిరుగాలి…”, “సాహసం శ్వాసగా సాగిపో…”, “హాయ్ రే హాయ్…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి.
అప్పట్లో గుణశేఖర్ సినిమా అనగానే ఓ భారీ సెట్ ఉంటుందని ప్రచారం ఉండేది. అందుకు తగ్గట్టుగానే ‘ఒక్కడు’ సినిమా కోసం చార్మినార్ సెట్ ను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ సినిమాకు ముందు మహేశ్ నటించిన “టక్కరి దొంగ, బాబీ” అంతగా అలరించలేక పోయాయి. ఈ చిత్రం గుడ్ టాక్ సంపాదించగానే అభిమానులు విపరీతంగా ‘ఒక్కడు’ను చూసి, ఆనందించారు. మాస్ హీరోగా మహేశ్ కు ఈ చిత్రం మంచి మార్కులు సంపాదించి పెట్టింది. దాదాపు వంద కేంద్రాలలో శతదినోత్సవం చూసిందీ చిత్రం. ఈ చిత్రానికి ద్వితీయ ఉత్తమ చిత్రంగా రజత నంది లభించింది. గుణశేఖర్ ఉత్తమ దర్శకునిగా నంది సొంతం చేసుకోగా, ఉత్తమ ఛాయాగ్రాహకునిగా శేఖర్ వి.జోసెఫ్, బెస్ట్ ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా అశోక్, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా రాజు సుందరం, బెస్ట్ ఫైట్ మాస్టర్ గా ఫెఫ్సీ విజయన్ నంది అవార్డులు అందుకొనేలా చేసిందీ చిత్రం.
‘ఒక్కడు’ ఘనవిజయంతో ఈ కథను పలు భాషల్లో రీమేక్ చేశారు. 2004లో విజయ్ హీరోగా తమిళంలో ‘గిల్లీ’గా తెరకెక్కింది. 2006లో పునీత్ రాజ్ కుమార్ హీరోగా ‘అజయ్’ పేరుతో కన్నడలో రూపొందింది. 2008లో బెంగాల్ లో ‘జోర్’గానూ, ఒడియాలో ‘మోటే అనిదెల లఖే ఫగుణ’గానూ రీమేక్ చేశారు. 2015లో అర్జున్ కపూర్ హీరోగా హిందీలో ‘దేవర్’గానూ, 2021లో సింహళభాషలో ‘కబడ్డీ’గానూ పునర్నిర్మితమయింది. ఇదే తరహా కథతో తెలుగులో నాయికను రక్షించే నాయకుని కథలు వెలుగు చూశాయి.