గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఈ సారి భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు నందమూరి ఫ్యాన్స్. మే 20కు ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే ఉండదంతో అభిమానుల సంబరాలు అప్పుడే అంబరాన్ని అంటాయి. రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ తారక్ బర్త్‌డే హంగామా గట్టిగా కనిపిస్తోంది. ముఖ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో కన్నడ నందమూరి అభిమానులు ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను పండగలా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. రెండు రోజుల ముందే అక్కడ భారీ ఎత్తున వేడుకలు ప్రారంభించారు.
బెంగళూరు హోంగసంద్ర పరిధిలోని బృంద థియేటర్ వద్ద కన్నడ ఫ్యాన్స్ ఎన్టీఆర్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇందులో అసలు విశేషం ఏంటంటే.. తారక్ నెక్ట్స్ సినిమాకు సంబంధించి భారీ కటౌట్ ను ఏర్పాటు చేసారు. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో GodOfWar అనే టైటిల్‌తో సినిమా రాబోతోంది. తారక్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేయబోతున్నారు. అయితే అఫీషియల్ అప్‌డేట్ రాకుండానే ఆ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ను ఏఐలో రెడీ చేసి థియేటర్ ముందు భారీ కటౌట్ నిలబెట్టడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. భారీ కటౌట్ ఏర్పాటు చేసిన అనంతరం అభిమానులు అక్కడ పెద్ద ఎత్తున కోలాహలం చేశారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ.. సదరు కటౌట్‌కు ఘనంగా పాలాభిషేకాలు నిర్వహించారు. సినిమా అప్‌డేట్లతో సంబంధం లేకుండా కేవలం తమ హీరోపై ఉన్న అభిమానంతో కన్నడ ప్రేక్షకులు చేస్తున్న ఈ హంగామాకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
