దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” చిత్రం 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం టీమ్ అంతా సినిమా ప్రమోషన్‌లో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం ముంబైలో జరిగిన ఈ సినిమా ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు.
ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో మన స్టార్స్ ఎన్టీఆర్, చరణ్ అభిమానులు కూడా పాల్గొన్నారు. తమ అభిమాన తారలను చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అంతేనా ఈవెంట్ లో బారికేడ్లను సైతం పగులగొట్టారు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి స్టేజ్ మీద నుండి వారిని నియంత్రించడానికి ప్రయత్నించాడు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రచ్చరచ్చ చేశారు. ఎన్టీఆర్‌ని చూసిన అభిమానులు ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. ఓ అభిమాని అయితే బారికేడ్లను బద్దలు కొట్టుకు వచ్చి మరీ “వి లవ్ యూ ఎన్టీఆర్” అంటూ అరవడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత తెలుగులో తన అభిమానిని స్టేజ్‌పై నుంచి ప్రశాంతంగా ఉండమని కోరారు.
ఈ ఈవెంట్‌లో దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి అద్భుతంగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఎంట్రీని అజయ్ దేవగన్ కోసం ప్లాన్ చేసినట్లు చెప్పాడు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ఉత్తర భారతదేశంలోని థియేటర్లలో ఈ సినిమా పంపిణీ హక్కులను జయంతిలాల్ గడా కొనుగోలు చేశారు. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్‌కి మంచి ఆదరణ లభించింది. యాక్షన్, భావోద్వేగాలతో నిండి ఉంది.ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల కల్పిత కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది.
