NTR: యంగ్ టైగర్ యన్టీఆర్ ఆటగాడు, పాటగాడు, మంచి పాత్రల కోసం అన్వేషించే వేటగాడు! కాదంటారా!? కాకపోతే, 2018లో యన్టీఆర్ సోలో హీరోగా నటించిన ‘అరవింద సమేత… వీరరాఘవ’ విడుదలయింది. అప్పటి నుంచీ నాలుగేళ్ళకు అంటే గత సంవత్సరం ‘ట్రిపుల్ ఆర్’ జనం ముందు నిలచింది. అది మల్టీస్టారర్! కాబట్టి, హీరోగారికి సోలో సినిమా రాక ఇప్పటికి అయిదేళ్ళయిందన్న మాట! అయినా వస్తోందా? అంటే అదీ లేదు ఎందుకంటే యంగ్ టైగర్ తాజా చిత్రం రాబోయేది వచ్చే యేడాదే! ఇంత గ్యాప్ తీసుకున్న తరువాత రాబోయే చిత్రంలో పలు ప్రత్యేకతలు జోడించాలి కదా! యంగ్ టైగర్ లేటెస్ట్ మూవీ ఆయనకు 30వ చిత్రం కావడం విశేషం! అలాగే ఓ సూపర్ హిట్ పట్టాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు యంగ్ టైగర్. అదే తీరున ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న కొరటాల శివకు అదో అగ్నిపరీక్ష! ఎందుకంటే, ఇంతకు ముందు కొరటాల శివ తెరకెక్కించిన ‘ఆచార్య’ అలరించలేక పోయింది. వరుస విజయాలు చూసిన కొరటాలకు ఆ సినిమా ఫలితం కొరకరాని కొయ్యగా మిగిలింది. ఈ నేపథ్యంలో యన్టీఆర్ కొత్త సినిమా హీరోగా తారక్ కు, డైరెక్టర్ గా కొరటాలకు ఇద్దరికీ అతి ముఖ్యమైనది. అందువల్లే ఈ సినిమాను మాస్, క్లాస్ అన్ని వర్గాల వారు మెచ్చేలా తెరకెక్కిస్తున్నారు. ఇందులో యన్టీఆర్ డ్యుయల్ రోల్ లో కనిపిస్తారట! అదలా ఉంచితే, మరో విశేషం కూడా ఈ సినిమాలో చోటు చేసుకోనుందని తెలుస్తోంది.
ముందుగానే ముచ్చటించుకున్నట్టు యంగ్ టైగర్ ఆటగాడు, పాటగాడు కూడా! ఆయన ఆట ఏ తీరున సాగుతుందో పాటల్లో తెలుసుకున్నాం. అలాగే తారక్ గళం విప్పితే ఎలా ఉంటుందో ‘యమదొంగ’ నుంచీ వింటున్నాం. ఇప్పుడు మరోమారు యంగ్ టైగర్ తన గాత్రంతో ఓ పాట పాడనున్నట్టు తెలుస్తోంది. యంగ్ టైగర్ 30వ సినిమాలోనే అది చోటు చేసుకోనుందని వినికిడి. కొరటాల శివ సైతం ఈ చిత్రాన్ని ఓ ఛాలెంజ్ గా భావించి తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు సూపర్ హిట్ జోడీగా అలరించిన యన్టీఆర్-శ్రీదేవి నటవారసులు ఈ సినిమాలో జంటగా నటిస్తూ ఉండడం విశేషం! యన్టీఆర్ మనవడు జూనియర్ యన్టీఆర్ తో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. అందువల్ల ఈ సినిమాలో ఓ రెయిన్ సాంగ్ ఉంటుందనీ వినిపిస్తోంది. ఎందుకంటే యన్టీఆర్, శ్రీదేవి తొలిసారి జంటగా నటించిన ‘వేటగాడు’లోని వానపాట “ఆకుచాటు పిందె తడిసె…” అప్పట్లోనే కాదు ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. అదలా ఉంచితే, ఇందులో ఓ పాటను యంగ్ టైగర్ తోనే పాడించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
యంగ్ టైగర్ తొలిసారి ‘యమదొంగ’ కోసం కీరవాణి బాణీల్లో “ఓలమ్మీ తిక్కరేగిందా…” సాంగ్ పాడారు. అది సూపర్ హిట్ అయింది. ఆ తరువాత ‘కంత్రి’లో మణిశర్మ స్వరకల్పనలో “వన్ టూ త్రీ…నేనో కంత్రీ…” అనే పాట ఆలపించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఆ పై ‘అదుర్స్’లో “చారీ…” పాటలోనూ గళం విప్పారు యంగ్ టైగర్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ పాట అలరించింది. థమన్ బాణీల్లో ‘రభస’ కోసం “రాకాసి…రాకాసి…” అంటూ పాడారు యంగ్ టైగర్. మరోమారు దేవిశ్రీ సంగీత సారథ్యంలో ‘నాన్నకు ప్రేమతో…’ టైటిల్ సాంగ్ లో గొంతు కలిపారు యంగ్ టైగర్. ఆ పైన కన్నడ చిత్రం ‘చక్రవ్యూహ’లో హీరో పునీత్ రాజ్ కుమార్ కోసం థమన్ స్వరాల్లో “గెలియా గెలియా…” అంటూ సాగే కన్నడ గీతం పాడారు యన్టీఆర్. ఏది ఏమైనా ఆరంభంలో ‘యమదొంగ’లో పాడిన పాట భలేగా అలరించడమే కాదు, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తరువాత యంగ్ టైగర్ గానం చేసిన ఏ సినిమా కూడా ఆ స్థాయిలో అలరించలేక పోయింది. తారక్ తొలిసారి పాడిన గీతం తాత యన్టీఆర్ ‘యమగోల’లోని సూపర్ హిట్ సాంగ్ కు రీమిక్స్! కాబట్టి, బంపర్ హిట్ అయిందని అభిమానుల మాట! వారి పలుకులకు విలువనిస్తూనే కొరటాల శివ కూడా రాబోయే సినిమాలో నటరత్న యన్టీఆర్, శ్రీదేవి నటించిన ‘వేటగాడు’లోని “జాబిలితో చెప్పనా…” పాటను రీమిక్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ పాటనే మన యంగ్ టైగర్ ఆలపిస్తారట! అంటే ఈ సినిమా కూడా ‘యమదొంగ’ రేంజ్ లో బంపర్ హిట్ ఖాయమని అప్పుడే ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు.