లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన లేటెస్ట్ మూవీ ‘కనెక్ట్’. థ్రిల్లర్ జనార్ లో రూపొందిన ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నయనతార స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ‘కనెక్ట్’ సినిమాతో పాటు తను నటించిన తెలుగు హీరోల గురించి కూడా చెప్పింది. ఈ ఇంటర్వ్యూలో నయనతార, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఊహించని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. ‘ఎన్టీఆర్ సేస్ట్ లో చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. మేము రిహార్సల్ చేయము, సింగల్ టేక్ లో చేసేస్తాం అని అందరూ చెప్తూ ఉంటారు కానీ నిజంగా రిహార్సల్ చెయ్యని ఏకైక హీరో ఎన్టీఆర్ మాత్రమే. ఈమధ్య రిహార్సల్స్ చేస్తున్నాడేమో తెలియదు కానీ అదుర్స్ సమయంలో అయితే ఎన్టీఆర్ రిహార్సల్స్ చెయ్యలేదు. రెడీ అనగానే వచ్చి డాన్స్ చేస్తాడు. కాస్త రిహార్సల్స్ చేద్దాం అని అడిగినా, నేను రెడీగా ఉన్నాను మీరు ప్రాక్టీస్ చెయ్యండి అంటాడు. అలాంటి డాన్సర్ ని చూడలేదు’ అంటూ నయన్ చెప్పుకొచ్చింది.
ఎన్టీఆర్, నయనతార కాంబినేషన్ లో ‘అదుర్స్’ సినిమా వచ్చింది. సూపర్ హిట్ అయిన ఈ మూవీలో నయనతార ‘చంద్రకళ’ పాత్రలో కనిపించగా, ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో నయనతార చేసిన బెస్ట్ క్యారెక్టర్స్ లో చంద్రకళ ఒకటి. ఇందులో చారీ పాత్రతో, ఆమె చేసే ఫన్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా బ్రహ్మానందం, నయనతార మధ్య ఉండే ఫన్నీ లవ్ ట్రాక్ పై ఈరోజుకీ మీమ్స్ వస్తుంటాయి. నయనతార ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి చెప్పడంతో, నందమూరి అభిమానులు ఆ బిట్ ని మాత్రమే కట్ చేసుకోని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇండియాస్ బెస్ట్ డాన్సర్, మాస్ ఆఫ్ మాసెస్ అంటూ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు.
