Nivedha Thomas: చూడగానే బాగా పరిచయమున్న అమ్మాయిలా అనిపిస్తుంది నివేదా థామస్. భూమికి కొంతే ఎత్తున ఉంటుంది. అయినా ఆమెలో ఏదో ఆకర్షణ దాగుంది. ఆ మోములోనే పలు భావాలు పలికించగల నేర్పూ ఉంది. మళయాళ సీమకు చెందిన ఈ పుష్పం, తెలుగు చిత్రసీమలోనూ తనదైన అభినయంతో సువాసనలు వెదజల్లింది. పలు భాషల్లో పరిణతి చెందిన నటిలా రాణిస్తోంది.
నివేదా థామస్ 1995 నవంబర్ 2న చెన్నైలో జన్మించింది. ఆమె కన్నవారు కేరళకు చెందినవారే అయినా, మద్రాసులో స్థిరపడ్డారు. బాల్యంలోనే నివేద అభినయంతో అబ్బుర పరచింది. కొన్ని మళయాళ చిత్రాల్లో బాలనటిగానూ మెప్పించింది. ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరో వైపు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది నివేద. ఆర్కిటెక్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించిన నివేదా థామస్ అనేక చిత్రాలలో నాయికగానూ మురిపించింది. మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ‘జెంటిల్ మేన్’లో నాని సరసన నాయికగా నటిస్తూ తెలుగు చిత్రసీమకు పరిచయమయింది. ఈ సినిమాతోనే నటిగా మంచి మార్కులు సంపాదించుకున్న నివేద, వెంటనే నాని హీరోగా రూపొందిన మరో చిత్రం ‘నిన్ను కోరి’లో నటించింది. మళ్ళీ షరా మామూలే అన్నట్టు నటనతో ఆకట్టుకుంది. జూనియర్ యన్టీఆర్ త్రిపాత్రాభినయంతో తెరకెక్కిన ‘జై లవకుశ’లోనూ నటించి మురిపించింది నివేద. ఆ చిత్రం సాధించిన విజయంతో నివేదకు వరుసగా తెలుగులో అవకాశాలు లభించాయి.
Read Also: Tollywood: ఈ డైరెక్టర్స్‌కేమైంది!? ‘హిట్ -2’ ఏం కాబోతోంది!?
‘జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్, 118, వి’ చిత్రాలలోనూ నివేద తనదైన అభినయంతో ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ‘వకీల్ సాబ్’లో నివేదా థామస్ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రంతోనూ నివేద నటిగా మంచి మార్కులే సంపాదించింది. మళయాళ, తమిళ చిత్రసీమల్లోనూ నటిగా మంచి గుర్తింపు సంపాదించిన నివేద ఆ మధ్య రజనీకాంత్ కూతురుగా ‘దర్బార్’లో నటించింది. ప్రస్తుతం నివేదా థామస్ ‘ఎందాడా సాజీ’ అనే మళయాళ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో సినిమాలేమీ లేకున్నా, ఆమె నటించిన పరభాషా అనువాదాలనూ చూడటానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఏ తెలుగు చిత్రంలో నివేద తనదైన అభినయంతో అలరిస్తుందో చూడాలి.
(నవంబర్ 2న నివేదా థామస్ పుట్టినరోజు)