వెంకటేష్ దగ్గుబాటి డిజిటల్ ప్రపంచంలోకి అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ సరైన స్క్రిప్ట్ కోసం వేటను ప్రారంభించింది. ఈ వెబ్ డ్రామాలో వెంకటేష్, రానా దగ్గుబాటితో కలిసి పని చేస్తారని టాక్ వినబడుతోంది. ఈ మల్టీస్టారర్ ను ముందుగా హిందీలో చిత్రీకరించి, తరువాత అన్ని భారతీయ భాషల్లోకి డబ్ చేస్తారు.
రాబోయే హిందీ వెబ్ డ్రామాను నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ వెబ్ డ్రామా మేకర్స్ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్‌ను కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం. నిషా అగర్వాల్ గతంలో “సోలో”, “ఏమైంది ఈ వేళ”, “సుకుమారుడు”, “సరదాగా అమ్మాయి”తో వంటి సినిమాల్లో నటించింది. వివాహం చేసుకున్న తరువాత నిషా అగర్వాల్ చిత్ర పరిశ్రమకు దూరమైంది. ఇప్పుడు ఆమె వెంకటేష్, రానా వెబ్ డ్రామాతో వినోద పరిశ్రమలో తిరిగి రావడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు.
మరోవైపు ప్రస్తుతం వెంకటేష్ కామెడీ ఫ్యామిలీ డ్రామా “ఎఫ్ 3″లో బిజీగా ఉన్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. రానా దగ్గుబాటి రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ “విరాట పర్వం” విడుదల కోసం వేచి ఉన్నాడు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది.
