మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పదవులకు ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుండి గెలిచిన సభ్యులు చేసిన రాజీనామాలను ఆమోదించినట్టు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. ఆ పదకొండు మందిని రాజీనామా ఉపసంహరించుకోమని కోరానని, నెల రోజులు గడిచినా వారు మనసు మార్కుకోకపోవడంతో, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ఆటంకం కాకుండా ఉండాలని వేరే వారితో ఆ పదవులను భర్తీ చేశామని విష్ణు చెప్పారు. అయితే నాగబాబు, ప్రకాశ్ రాజ్ తో సహా పదవులకు రాజీనామా చేసిన వారంతా ‘మా’ సభ్యులుగా కొనసాగుతారని విష్ణు తెలిపారు. అలానే ‘మా’ సభ్యులు 914 మంది కోసం ఉచిత హెల్త్ క్యాంప్ ను మెడికవర్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించామని, ప్రతి యేడాది డిసెంబర్ రెండో వారంతో దీనిని జరుపుతామని, దీనికి ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి నేతృత్వం వహిస్తున్నారని విష్ణు అన్నారు. ‘మా’ బిల్డింగ్ కు సంబంధించిన ప్రకటన కూడా ఓ వారం రోజుల్లో చేస్తామని ఆయన చెప్పారు.
మాదాల రవి మాట్లాడుతూ, ”సభ్యుల ఆరోగ్యం ముఖ్యం. సామాజిక స్పృహతో పనిచేస్తున్న మెడికవర్ హాస్పటల్ కి కృతజ్ఞతలు. చాలా హాస్పిటల్స్ తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఉచితంగా మాస్టర్ హెల్త్ చెకప్ చేయడానికి మెడికవర్ హాస్పటల్ ముందుకు వచ్చింది. అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అనిల్, ‘మా’ జనరల్ సెక్రటరి రఘుబాబు, ట్రెజరర్ శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు.
