Site icon NTV Telugu

Mimoh Chakraborty: ‘నేనెక్కడున్నా’ అంటున్న మిథున్ తనయుడు!

Nenekkadunna

Nenekkadunna

Nenekkadunna Movie: సీనియర్ హిందీ హీరో మిథున్ చక్రవర్తికి తెలుగు సినిమా రంగంలో చక్కని అనుబంధం ఉంది. ఆయన నటించిన హిందీ చిత్రాలు తెలుగు రీమేక్ కావడమే కాదు… అనేక తెలుగు హిందీ రీమేక్స్ లో మిథున్ నటించాడు. మూవీ మొఘల్ డి. రామానాయుడు హిందీలో మిథున్ తో ‘దిల్ వాలా’ మూవీ నిర్మించారు. అలానే సురేశ్ బాబు నిర్మించిన ‘గోపాల గోపాల’ చిత్రంలో మిథున్ చక్రవర్తి ఓ కీలక పాత్ర పోషించారు. తాజాగా మిథున్ చక్రవర్తి తనయుడు మిమో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతను హీరోగా మాధవ్ కోదాడ దర్శకత్వంలో కె.బి.ఆర్. సమర్పణలో మారుతి శ్యాంప్రసాద్ రెడ్డి ‘నేనెక్కడున్నా’ అనే సినిమా నిర్మించారు. ఎయిర్ టెల్ వాణిజ్య ప్రకటనతో గుర్తింపు తెచ్చుకున్న, ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్‌’ ఫేమ్ సశా ఛెత్రి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పోస్టర్ ను, టీజర్ ను ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. కథ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, ఇటువంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్” అని చెప్పారు.

చిత్ర దర్శకుడు మాధవ్ కోదాడ మాట్లాడుతూ ”జర్నలిజం, రాజకీయం నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది” అని చెప్పారు. నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ “సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ముంబై, హైదరాబాద్, బెంగళూరులో షూటింగ్ చేశాం. ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉన్నాం. స్టోరీ, మ్యూజిక్, విజువల్స్, డైరెక్షన్ మా సినిమాకు బలం. ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో రష్యన్ డాన్సర్లతో చేసిన పబ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు.

Exit mobile version