Site icon NTV Telugu

NBK: బాలయ్య… బాలయ్యా… ఫ్యాన్స్ గుండెల్లో గోలయ్యా!

Nbk

Nbk

నటసింహం నందమూరి బాలకృష్ణ నటజీవితాన్ని పరిశీలిస్తే అబ్బురం అనిపిస్తుంది. ఇప్పుడున్న నటుల్లో బాలకృష్ణనే సీనియర్. ఎన్నెన్నో అపూర్వ విజయాలు, అనితరసాధ్యమైన రికార్డులు బాలయ్య కెరీర్ లో చోటు సంపాదించాయి. బాలయ్య పని అయిపోయింది అన్న ప్రతీసారి ఆయన అనూహ్య విజయాలను సొంతం చేసుకున్నారు. అందుకు ఆయన నటించిన ‘అఖండ’ తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. వసూళ్ళ పరంగానే కాదు, రన్నింగ్ లోనూ బాలకృష్ణ సినిమాల తీరే వేరుగా సాగుతూ ఉంటుంది. ఆయన అభిమానుల తీరు కూడా వేరుగానే కనిపిస్తుంది. బాలయ్య చేయి తాకితే చాలనుకొనేవారు కొందరయితే, ఆయన చేయి చెంపకు పరంబైనా కన్నీరు ఆదేశమైనా మరింత అభిమానాన్ని నింపుకొని జేజేలు కొడుతూ ఉంటారు.

బాలకృష్ణ 1960 జూన్ 10న మహానటుడు యన్టీఆర్ అయిదవ కొడుకుగా జన్మించారు. తండ్రి నేర్పిన క్రమశిక్షణ, తల్లి బసవరామతారకం చూపిన ప్రేమానురాగాలు బాలయ్యను విలక్షణంగా తీర్చిదిద్దాయి. ఇప్పటికీ ఉదయం నాలుగు గంటలకే లేచి, క్రమశిక్షణతో మెలగుతూ, పూజాపునస్కారాలు కావించి, తన వృత్తిని దైవంగా భావిస్తూ సాగుతున్నారాయన. బయట ఆయన గురించిన కామెంట్స్ ఎలా వినిపించినా, చిత్రసీమలో మాత్రం బాలయ్యతో ఒక్కసారి పరిచయమయితే చాలు, బయట వినిపించేవన్నీ పుకార్లే అని తేలిపోతుంది అంటారు.

బాలకృష్ణ తొలి చిత్రం ‘తాతమ్మకల’లోనే మహానటులు యన్టీఆర్, భానుమతి, కాంచనతో కలసి పనిచేశారు. తరువాతి చిత్రం ‘రామ్-రహీమ్, వేములవాడ భీమకవి’ చిత్రాలలో తన తండ్రి యన్టీఆర్ తొలి హీరోయిన్ షావుకారు జానకితోనూ నటించారు. తండ్రి కథానాయికలుగా మెప్పించిన కె.ఆర్.విజయ, లక్ష్మి, ప్రభ, శారద, వాణిశ్రీ వంటివారితోనూ నటించి అలరించారు బాలయ్య. ఇక యన్టీఆర్ నాయికలుగా నటించిన రతి, రాధ, జయసుధతో బాలయ్య కూడా జోడీ కట్టడం విశేషం! యన్టీఆర్ తరువాత తెలుగునాట అత్యధిక స్వర్ణోత్సవ చిత్రాలు కలిగిన హీరోగా బాలయ్య చరిత్ర సృష్టించారు. ఆయన నటించిన “మంగమ్మగారి మనవడు, ముద్దుల క్రిష్ణయ్య , ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, లెజెండ్” వంటి చిత్రాలు స్వర్ణోత్సవాలు జరుపుకున్నాయి. ‘లెజెండ్’ సినిమా అయితే ఏకంగా వెయ్యి రోజులు ప్రదర్శితమై దక్షిణాదిన అత్యధిక రోజులు చూసిన చిత్రంగా ఓ చరిత్ర సృష్టించింది. కోడి రామకృష్ణ, బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రాలు భలేగా సందడి చేశాయి. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ సైతం అలాగే అలరిస్తోంది.

‘అఖండ’ చిత్రం ఘనవిజయంతో భారతీయ చిత్రసీమలోనే ఓ అరుదైన రికార్డును నమోదు చేశారు బాలకృష్ణ. అదేమిటంటే- ఓ హీరో, ఓ దర్శకునితో నటించిన మూడు చిత్రాలలోనూ వరుసగా ద్విపాత్రాభినయం చేయడం! ఆ చిత్రాలన్నీ డైరెక్ట్ సిల్వర్ జూబ్లీస్ చూడడం. అందునా రోజూ 4 ఆటలతో ఆ చిత్రాలు ప్రదర్శితమం కావడం అన్నది అరుదైన విశేషం! అంతకు ముందు బాలకృష్ణతో బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ‘అఖండ’తో వారిద్దరి కాంబో ‘హ్యాట్రిక్’ సాధించింది. ఈ మూడు చిత్రాలు రోజూ 4 ఆటలతో డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. ‘అఖండ’కు సీక్వెల్ ఉంటుందట! మరి ఆ సినిమాతో బాలయ్య, బోయపాటి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తరువాత బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ఆరంభం కానుంది. ఈ చిత్రాలతో బాలయ్య ఏ తీరున సందడి చేస్తారో చూడాలి.

Exit mobile version