నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న 107వ చిత్రం ఫస్ట్ హంట్ ఆయన బర్త్ డే కానుకగా జనం ముందు నిలచింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం టీజర్ లో బాలయ్యకు సంబంధించిన పలు సెంటిమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ‘సింహ’ అనే పదం బాలకృష్ణకు భలేగా అచ్చివస్తోంది. పైగా ఆయన నరసింహస్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఆ సెంటిమెంట్ తోనే ఈ ఫస్ట్ హంట్ లోనే శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనమిస్తారు. ఇక ఎమోషనల్ డైలాగ్స్ బాలయ్య నోట పలికించడం, వాటిని ఫస్ట్ టీజర్ లోనే ప్రదర్శించడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఇందులో కూడా అలాంటి డైలాగ్స్ చోటు చేసుకున్నాయి. “మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్..” అంటూ మొదట్లోనే వినిపిస్తుంది.
నల్లని షర్ట్, ఆకుపచ్చ రంగు పంచె కట్టుకొని బాలకృష్ణ రగ్గుడ్ లుక్ తో కనిపించారు. “భయం నా బయోడేటాలోనే లేదురా బోసడీకే…” అంటూ బాలయ్య తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్ కూడా అభిమానులను అలరించేలా ఉన్నాయి. ‘సింహా, లెజెండ్’ చిత్రాల్లోలాగే ప్రత్యేకంగా డిజైన్ చేయించిన గండ్రగొడ్డలిని పట్టుకొని బాలయ్య ఫెరోషియస్ గానూ ఉన్నారు. అంతేకాదు, “నరకడం మొదలు పెడితే ఏ పార్టేదో మీ పెళ్ళాలకు కూడా తెలియదు నా కొడకల్లారా..” అంటూ బాలయ్య ఇందులో గర్జించారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ స్వరకల్పన చేస్తున్నారు. శ్రుతి హాసన్ ఇందులో నాయిక. మరి ఈ సినిమా ఏ టైటిల్ తో జనం ముందు నిలుస్తుందో? ఎప్పుడు ఏ తీరున విడుదలై అలరిస్తుందో చూడాలి.
