NTV Telugu Site icon

Nawazuddin Siddiqui: మాజీ భార్య ఆరోపణలకు బదులిచ్చిన బాలీవుడ్ స్టార్!

Nawa

Nawa

Aaliya: బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్థికీ మొత్తానికీ పెదవి విప్పాడు. గత కొంతకాలంగా అతని మాజీ భార్య అలియా చేస్తున్న ఆరోపణలకు సోషల్ మీడియా వేదికగా బదులిచ్చాడు. నవాజుద్దీన్ మాజీ భార్య అలియా కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ ను పోస్ట్ చేస్తూ వస్తోంది. నవాజుద్దీన్ తన పిల్లలను ఇంట్లోకి రానివ్వడం లేదని, తానూ, పిల్లలు రోడ్డున పడ్డామని వాపోయింది. తన దగ్గర 81 రూపాయిలు తప్పితే మరేమీ లేవని, అర్థరాత్రి ముంబై నగరంలో ఎటు పోవాలో తెలియడం లేదని తెలిపింది. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు, సినీ రంగానికి చెందిన వారు కూడా నవాజుద్దీన్ వైఖరిని తప్పు పట్టారు. భార్యకు విడాకులు ఇచ్చినా… పిల్లలను చూసుకోవడానికి వెనకడుగు వేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అయితే… వీటన్నింటికి నవాజుద్దీన్ ఈరోజు సమాధానం చెప్పాడు.

ఇప్పటి వరకూ తాను మౌనంగా ఉండటానికి కారణం పిల్లలేనని, ఈ మొత్తం తమాషాను వారు ఎక్కడైనా చదివితే బాధపడతారనే తాను మీడియాకు ఎక్కలేదని తెలిపాడు. అయితే సోషల్ మీడియాలోనూ, ప్రెస్ లోనూ కొందరు తనను అవహేళన చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నారని, తన గురించి వచ్చిన ఆరోపణలకు సంబంధించిన మరో కోణాన్ని వారు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని విమర్శించాడు. మీడియాలో వస్తున్న వార్తలు, వీడియోలు తారుమారు చేసినవేనని తెలిపాడు. ఈ సుదీర్ఘ వివరణలో నవాజుద్దీన్ అనేక విషయాలను వెల్లడించాడు. తాను అలియా ఎన్నో సంవత్సరాలుగా వేర్వేరుగా ఉంటున్నామని, ఇప్పటికే విడాకులు కూడా తీసుకున్నామని, అయితే పిల్లల కోసం ఓ అవగాహనతో జీవితాన్ని సాగిస్తున్నామని చెప్పాడు. గత 45 రోజులుగా తన పిల్లలు స్కూల్ కు హాజరు కాలేకపోయారని, పాఠశాల యాజమాన్యం నుండి తనకు వివరణ కోరుతూ లెటర్స్ వస్తున్నాయని, నలభై ఐదు రోజులుగా వాళ్లు దుబాయ్ లోనే బందీలుగా ఉన్నారని తెలిపాడు. వారిని ఇండియాకు తీసుకు రావడానికి అలియా డబ్బులు డిమాండ్ చేసిందని చెప్పాడు. గడిచి రెండు సంవత్సరాలలో సగటున ప్రతి నెల తాను పది లక్షల రూపాయలను ఖర్చుల కోసం ఇచ్చానని, అలానే దుబాయ్ వెళ్ళడానికి ముందు ఐదు నుండి ఏడు లక్షల రూపాయల చొప్పున పిల్లల స్కూల్ ఫీజులు, వైద్యం, ప్రయాణాలకు చెల్లించానని తెలిపాడు. ఆమె జీవితంలో ఆర్థికంగా స్థిరపడటం కోసం మూడు సినిమాలలో నటించి, కోట్ల రూపాయలను సమకూర్చానని చెప్పాడు.

పిల్లలను చూసుకోవడానికి ఇచ్చిన లగ్జరీ కారును అలియా తన వ్యక్తిగత అవసరాలకోసం అమ్మేసిందని, అలానే ముంబైలోని వర్సోవాలోని అపార్ట్ మెంట్ కు ఆమె కో-ఓనర్ అని, దుబాయ్ లోనూ ఓ అపార్ట్ మెంట్ ను పిల్లల కోసం ఇచ్చానని తెలిపాడు. అక్కడ ఆమె కంఫర్టబుల్ గా ఉండొచ్చని చెప్పాడు. అయితే ఇవి చాలక మరింత డబ్బుల్ని తన నుండి డిమాండ్ చేయడం కోసమే తన మీద, తన తల్లి మీద రకరకాలుగా కేసులు పెడుతోందని, అది ఆమెకు నిత్యకృత్యంగా మారిపోయిందని నవాజుద్దీన్ వాపోయాడు. గతంలో ఆమె ఇలానే చేసి, డబ్బులు ఇచ్చిన తర్వాత కేసులను వాపస్ తీసుకుందని చెప్పాడు. తన పిల్లలు ఇండియా వచ్చినప్పుడు తన తల్లి (నానమ్మ) దగ్గరకు వెళ్ళొచ్చని, ఆ రకంగా ఏర్పాట్లు చేశానని, వారిని ఇంటి నుండి గెంటేసినట్టుగా అలియా చేస్తున్న ఆరోపణలలో నిజం లేదని, అదే జరిగి ఉంటే… ఆ వీడియోను కూడా పెడితే బాగుండేదని అన్నాడు.

కేవలం తనను బ్లాక్ మెయిల్ చేయడం కోసం పిల్లలను ఈ వ్యవహారంలోకి లాగుతోందని, అలానే తనకున్న మంచి పేరును పాడు చేయాలని, తన కెరీర్ ను నాశనం చేయాలని కంకణం కట్టుకుందని నవాజుద్దీన్ సిద్ధికి చెప్పాడు. ఇవి తాను చేస్తున్న ఆరోపణలు కాదని, తన మనోభావాలను ఇలా వ్యక్తం చేస్తున్నానని నవాజుద్దీన్ వివరణ ఇచ్చాడు. మరి దీనిపై అలియా ఎలా స్పందిస్తుందో!!

Show comments