Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!

Nawazuddin Siddiqui 300kb

Nawazuddin Siddiqui 300kb

Nawazuddin Siddiqui: ఒక నటుడి కెరీర్‌ను పూర్తిగా మార్చేయడానికి ఒక్క సినిమా చాలు.. అప్పటివరకు చిన్న చిన్న పాత్రల కోసం ఎదురుచూసిన నటుడికి ఒక్కసారిగా వరుస ఆఫర్లు రావడం, నిర్మాతలు కూడా పారితోషికం ఎంత కావాలంటే అంత రాసుకోమంటూ బ్లాంక్ చెక్కులు ఇవ్వడం అంటే మాటలు కాదు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ జీవితంలో అలాంటి మలుపు తీసుకొచ్చిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ 2’. ఈ సినిమా తనను తొలిసారి స్టార్‌గా భావించేలా చేసిందని నవాజుద్దీన్ తాజాగా గుర్తుచేసుకున్నారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ రెండు భాగాలుగా 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రెండో భాగంలో ఫైజల్ ఖాన్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించారు. ఆ పాత్ర ఆయన కెరీర్‌కు ఎంత పెద్ద గుర్తింపు తీసుకొచ్చిందంటే, సినిమా విడుదలైన తర్వాత ఆయనకు వచ్చిన అవకాశాలు కూడా ఒక్క సారిగా పెరిగి పోయాయి.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను ఏ సినిమా స్టార్‌గా భావించేలా చేసిందని అడగ్గా, ఎలాంటి సందేహం లేకుండా ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ 2’ అని నవాజుద్దీన్ చెప్పారు. ఆ సినిమా తర్వాత తన దగ్గరకు దాదాపు 200 స్క్రిప్టులు వచ్చాయని వెల్లడించారు. అంతేకాదు కొంతమంది నిర్మాతలు స్క్రిప్ట్‌తో పాటు బ్లాంక్ చెక్కులు కూడా తన టేబుల్‌పై పెట్టేవారని తెలిపారు. మీకు ఎంత పారితోషికం కావాలో మీరే రాసుకోండి, మీకు ఖాళీగా ఉన్న డేట్స్ చెప్పండి అంటూ ఆఫర్లు వచ్చేవని ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే ఇంత పెద్ద అవకాశం ఒక్కసారిగా వచ్చినా నవాజుద్దీన్ మాత్రం ఆఫర్లకు తొందరపడలేదు. తన దగ్గరకు వచ్చిన ప్రతి కథను అంగీకరించకుండా, తనకు నచ్చిన కథ, కంటెంట్ ఉన్న పాత్ర కోసం ఎదురుచూశారు. అప్పట్లో వచ్చిన చాలా స్క్రిప్టులు తనను అంతగా ఆకట్టుకోలేదని, అందుకే వాటికి సంతకం చేయకుండా ఉండిపోయానని ఆయన మరోసారి గుర్తు చేసుకున్నారు.

‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ 2’లో ఫైజల్ ఖాన్ పాత్రతో వచ్చిన క్రేజ్ నవాజుద్దీన్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత ఆయన ‘ది లంచ్‌బాక్స్’, ‘మాంటో’, ‘మాంఝీ: ది మౌంటెన్ మ్యాన్’, ‘బడ్లాపూర్’, ‘బజరంగీ భాయిజాన్’ వంటి విభిన్నమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఏళ్ల తరబడి చిన్న పాత్రల కోసం ఎదురుచూసిన నటుడి టేబుల్‌పై ఒక్కసారిగా 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు వచ్చిపడే స్థాయికి తీసుకెళ్లిన సినిమా మాత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ 2’. కానీ ఆ తరువాత డబ్బుకోశం తొందరపడకుండా, సరైన కథ కోసం ఎదురుచూసిన తీరు మాత్రం నవాజుద్దీన్ కెరీర్‌లో మరో ముఖ్యమైన పాఠంగా నిలిచింది.