నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నాచెల్లెళ్ళు గా నటించిన సినిమా ‘#BRO’. మ్యాంగో మాస్ మీడియా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ సమర్పణలో కార్తీక్ తుపురాణి దర్శకత్వంలో జె. జె. ఆర్. రవిచంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని నవీన్ చంద్ర, అవికాగోర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవల రశ్మిక మందన్న ఆవిష్కరించింది. దీనికి మంచి అప్లాజ్ లభించిందని నిర్మాత రవిచంద్ తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ తుపురాణి మాట్లాడుతూ, ”అన్నయ్య చెల్లెలు మధ్య జరిగే ఓ మంచి ఎమోషనల్ ఫాంటసీ డ్రామా గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.
హీరోయిన్ గా గ్లామర్ రోల్స్ లో నటించే అవికాగోర్ ఇందులో నవీనచంద్ర కు చెల్లెలు గా నటించడానికి ఒప్పుకోవడం, అలాగే ఎన్నో హిట్లు ఇచ్చిన నవీన్ చంద్ర అన్న పాత్రను చేయడం విశేషం. ఈ చిత్రాన్ని వైజాగ్, దాని పరిసర ప్రాంతాల్లోని అందమైన ప్రదేశాలలో షూట్ చేయడం జరిగింది. మంచి విజువల్స్, మంచి మ్యూజిక్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి” అని అన్నారు. ఈ చిత్రంలో సంజన సారథి, సాయి రోనక్ సైతం కీలక పాత్రలు పోషించారు.