Site icon NTV Telugu

Nassar: నన్ను చంపేస్తానని చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడు..

Chiru

Chiru

ప్రముఖ నటుడు నాజర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఆయన ఎన్నో సినిమాల్లో కనిపించారు. ముఖ్యంగా స్టార్ హీరోలకు తండ్రిగా నాజర్ నటించిన అన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ మొదలుపెట్టిన రోజులను గుర్తుచేసుకున్నాడు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. చిరంజీవి, నాజర్ ఒకే యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన గుర్తుచేశారు. “నేను, చిరంజీవి ఒకే యాక్టింగ్ స్కూల్ లో ట్రైనింగ్ తీసుకున్నాం.. ఆ సమయంలో నేను 60 కిలోమీటర్ల దూరంలో ఉండే చెంగల్‌పట్టు నుంచి చెన్నై వచ్చేవాడిని. టైమ్‌కు రావాలంటే ఉదయం 6 గంటలకే బయలుదేరాల్సి ఉండేది. ఆ టైములో కూరలు చేసే సమయం లేక అన్నం మాత్రం వండుకుని తెచ్చుకునే వాడిని. చిరంజీవి,అలాగే నా స్నేహితులు ఆంధ్రామెస్ నుంచి అన్నం తెచ్చుకుని తినేవాళ్లు. ఒకరోజు నేను అన్నం మాత్రమే తెచ్చుకున్నాను అని తెలియడంతో చిరంజీవి నా మీద కోప్పడ్డాడు.

మీ అమ్మగారిని అంత పొద్దునే వంట చేయమని ఇబ్బంది పెడితే చంపేస్తాను. ఏమనుకున్నావో… రేపటి నుండీ మాతోనే కలిసి భోజనం చెయ్యాలి అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ తరువాత అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం.. చిరంజీవి చాలా టాలెంటెడ్.. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సు పూర్తయిన వెంటనే ఆయనకు అవకాశాలు రావడం, పెద్ద స్టార్ గా మారడం జరిగిపోయాయి. అయితే నాకు మాత్రం పెద్ద అవకాశాలు రాక.. అక్కడే హోటల్ లో వెయిటర్ గా పనిచేశాను. ఇక ఒక రోజు ఆ పక్కనే చిరంజీవి షూటింగ్ జరుగుతుంటే.. అందరూ గుమిగూడి చూస్తున్నారు. నేను కూడా వెళ్లి చూసి వెనక్కి తిరిగి వచ్చేస్తుండగా చిరు నన్ను చూసి పిలిచి ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. ఇలా హోటల్లో ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పాను. ‘అదేంటయ్యా గొప్ప నటుడివి, నువ్వు వెయిటర్ గా పనిచేయడం ఏంటి? రేపు నువ్వు నన్ను వచ్చి కలువు అన్నారు. కానీ నేను వెళ్ళలేదు. కొన్నాళ్ళకి బాలచందర్ గారి వల్ల ఓ సినిమాలో నటించాను. ఆ తరువాత చాలా సినిమాల్లో మేము కలిసి నటించాము.. నా గురించి ఆయనకు బాగా తెలుసు.. నాకు ఆత్మగౌరవం ఎక్కువ అని.. అందుకే నన్ను ఆయన ఇబ్బంది పెట్టడు.. ఇప్పటికి మా ఇద్దరి మధ్య స్నేహం అలా కొనసాగుతూనే ఉంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version