ఓవైపు హీరోలందరూ ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గగనమౌతుంటే.. నేచురల్ స్టార్ నాని మాత్రం కనీసం మూడు సినిమాల్ని రిలీజ్ చేస్తున్నాడు. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి సుడి తిరగడంతో, వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ నేచురల్ స్టార్.. లేటెస్ట్‌గా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇన్‌సైడ్ న్యూస్ ప్రకారం.. మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట!
ఆల్రెడీ నాని – మారుతి కాంబోలో ‘భలే భలే మగాడివోయ్’ సినిమా వచ్చింది. 2015లో వచ్చిన ఈ చిత్రం.. ఫ్యామిలీ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతోనే నానికి మరింత పాపులారిటీ వచ్చిపడిందని చెప్పుకోవడంలో సందేహం లేదు. తనకు ఇలాంటి మంచి హిట్ ఇచ్చినందుకే, మారుతితో కలిసి మరో ప్రాజెక్ట్ చేసేందుకు నాని సిద్ధమయ్యాడని తెలుస్తోంది. రీసెంట్‌గానే వీరి మధ్య కథా చర్చలు జరిగాయని, స్టోరీ బాగుండడంతో నాని పచ్చజెండా ఊపేశాడని టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన పనులు సైతం జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి.
నిజానికి.. మారుతి తన తదుపరి సినిమా ప్రభాస్‌తో చేయాల్సింది. అయితే, అతడు ‘సలార్’తో పాటు ప్రాజెక్ట్ కే చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా.. సలార్ మీదే ఎక్కువ దృష్టి సారించాడు. ఈ ప్రాజెక్ట్ నుంచి ఫ్రీ అవ్వడానికి అతనికి చాలా సమయమే పడుతుంది. అందుకే, ఈ గ్యాప్‌లో నానితో ఓ సినిమా చేయాలని మారుతి నిర్ణయించుకున్నాడని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లేలా సన్నాహాలు చేస్తున్నారని టాక్.
