నెపోటిజం… ఏ ఇండస్ట్రీలో అయినా ఉండేదే కానీ చిత్ర పరిశ్రమ ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమ ఫ్యామిలీ నుంచి హీరోలని లాంచ్ చెయ్యడానికి తాపత్రయ పడుతూ ఉంటారు. ఈ నెపో కిడ్స్ కారణంగా యంగ్ టాలెంట్ కి అవకాశాలు రావట్లేదు అనే మాట ఉంది. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉండే బాలీవుడ్, ప్రస్తుతం ఉన్న కష్టాలకి కారణం హిందీ చిత్ర పరిశ్రమ మొత్తం స్టార్ కిడ్స్ తో నిండి ఉండడమే. కరణ్ జోహార్ లాంటి దర్శక నిర్మాతలు నెపోటిజంని సపోర్ట్ ని చేస్తూ కొత్త టాలెంట్ ని అన్యాయం చేస్తున్నారు, అవకాశాలు ఇవ్వట్లేదు అని కామన్ ఆడియన్స్ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. నెపోటిజంకి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా చేశారు నార్త్ ఆడియన్స్. సుశాంత్ సింగ్ చనిపోవడం నెపోటిజంపై చర్చ మరింత పెరిగేలా చేసింది.
ఈ విషయంపై యంగ్ హీరో, నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. “నాని మొదటి సినిమా లక్ష మంది చూస్తారు, రామ్ చరణ్ మొదటి సినిమా కోటి మంది చూస్తారు… ఇక్కడ నెపోటిజంని ఎంకరేజ్ చేస్తుంది ఎవరు? ప్రేక్షకులే నెపోటిజంని ఎంకరేజ్ చేస్తున్నారు” అంటూ నాని తేల్చి చెప్పాడు. సింగర్ స్మిత హోస్ట్ గా చేస్తున్న “నిజం విత్ స్మిత” అనే ప్రోగ్రామ్ కి రానా, నాని గెస్టులుగా వచ్చారు. రేపు టెలికాస్ట్ కానున్న ఈ హిలేరియస్ ఎపిసోడ్ లో నాని, నెపోటిజం గురించి మాట్లాడిన ప్రామోని షో సోనీ లివ్ రిలీజ్ చేశారు. మరి ఫుల్ ఎపిసోడ్ లో అవుట్ సైడర్ గా వచ్చి స్టార్ హీరో అయిన నాని, నెపోటిజం గురించి ఇంకెన్ని కామెంట్స్ చేసాడో చూడాలి.