Telugu Movie: సింగిల్ క్యారెక్టర్ మూవీస్ గతంలోనూ వచ్చాయి. అయితే చేతి వేళ్ళ మీద లెక్కించదగ్గవే! సింగిల్ క్యారెక్టర్ తో తెరకెక్కిన ‘హలో మీరా’ మూవీ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలానే ఇప్పుడు మరో సినిమా అదే పంథాలో తెరకెక్కింది. ఇప్పటికే పలు చిత్రాలలోనూ, లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ నటించిన నందితా శ్వేత ఇందులో నాయిక. ‘రారా పెనిమిటి’ అనే పేరుతో ఈ సినిమాను సత్య వెంకట గెద్దాడ దర్శకత్వంలో ప్రమీలా గెద్దాడ నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చడం విశేషం.
ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ, “దర్శకుడు ఒక మంచి కథతో వచ్చి కలిశారు. మంచి పాటలు చేసే అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇంత వరకు చేసిన కంపోజిషన్ లో నాకు ఇష్టమైన పాటలు ఇందులో ఉన్నాయి. నీలకంఠ చక్కటి సాహిత్యాన్ని సమకూర్చారు. నందిత అద్భుతంగా నటించింది” అని అన్నారు. హీరోయిన్ నందితా శ్వేత మాట్లాడుతూ, “డైరక్టర్ కథ చెప్పి… సింగిల్ క్యారక్టర్ అనగానే … ఈ పాత్ర చేయగలనా అని మొదట భయపడ్డాను. సాహసమే అయినా ఓకే చెప్పాను. ఇలాంటి క్యారక్టర్ చేసే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా ఈ సినిమా చేయడం నా అదృష్టం. డైరక్టర్ గారు చెప్పింది చేసుకుంటూ వెళ్లాను. ఫస్ట్ కాపీ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. కొత్తగా పెళ్లైన అమ్మాయి తన భర్త రాక కోసం పడే విరహ వేదనే ఈ చిత్రం. అన్ని ఎమోషన్స్ ఈ పాత్రలో ఉన్నాయి. మణిశర్మ గారి సంగీతం ఈ సినిమాకు ప్రాణం. శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అద్భుతంగా చేశారు. వారు ఇప్పుడు లేకపోవడం బాధాకరం. ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను” అని అన్నారు.
దర్శకుడు సత్య వెంకట గెద్దాడ మాట్లాడుతూ, “కొత్తగా పెళ్లైన అమ్మాయి తన భర్త రాకకోసం ఎదురు చూస్తూ పడే విరహ వేదనే ఈ చిత్రం. తన భర్త వచ్చాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సింగిల్ క్యారక్టర్ తో రూపొందిన సినిమా ఇది. గ్రామీణ నేపథ్యం లో నడిచే కథ కాబట్టి ఆ గడుసుతనం ఉన్న అమ్మాయి కావాలని చాలా మందిని సెర్చ్ చేశాక నందిత గారైతే పర్ఫెక్ట్ అని తీసుకున్నాం. తను నేను అనుకున్న దానికన్నా అద్భుతంగా చేసింది. డైరక్టర్స్ నటి ఆమె. అష్ట లక్షణాలున్న పాత్రను చాలా ఈజీగా చేసింది. మణిశర్మ గారి వర్క్ ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్. నీలకంఠ నాకు మంచి మిత్రుడు. చక్కటి సాహిత్యాన్ని సమకూర్చారు. రామ్ కుమార్ సినిమాటోగ్రఫీ మరో హైలెట్ గా ఉంటుంది. సింగిల్ క్యారక్టర్ అయినప్పటికీ హీరోయిన్ తో పలు పాత్రలు ఫోన్ లో సంభాషిస్తుంటాయి. ఆ పాత్రలకు బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సునీల్, సప్తగిరి, హేమ, అన్నపూర్ణమ్మ ఇలా పలువురు నటీనటులు డబ్బింగ్ చెప్పారు. వారందరికీ నా ధన్యవాదాలు. సినిమా అంతా పూర్తయింది. త్వరలో విడుదల చేస్తాం“ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, నటుడు రాంకీ, పాటల రచయిత డాక్టర్ డి. నీలకంఠరావు, సింగర్ హరిణి ఇవటూరి తదితరులు పాల్గొన్నారు.