నమ్రతా శిరోద్కర్.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని ఇంటి కోడలు.. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య.. అద్భుతమైన గృహిణి.. ప్రేమను పంచే తల్లి.. ఇలా ఆమె గురించి ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. 1993 లో మిస్ ఇండియా మిస్ ఏషియా పసిఫిక్ గా ఎంపిక అయిన నమ్రతా.. ‘జబ్ ప్యార్ కిసీసే హోతాహై’ అనే హిందీ మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత వరుస వక్షలను అందుకొని బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొంది. ఇక వంశీ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమా షూటింగ్ లోనే మహేష్ ప్రేమలో పడిపోయింది. ఆ తరువాత మహేష్ ను కూడా ప్రేమలోకి దింపేసింది. ఇక వీరి ప్రేమను ఇంట్లో అంగీకరించడం.. వీరి పెళ్లి జరగడం.. నమ్రతా శిరోద్కర్ కాస్తా నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని గా మారడం చకచకా జరిగిపోయాయి. ఘట్టమనేని ఇంటి కోడలిగా అడుగుపెట్టిన తరువాత ఆమె తిరిగి సినిమాలవైపు చూడలేదు. ఒక గృహిణిగా, కుటుంబ బాధ్యతలను స్వీకరించింది.. గౌతమ్, సితార పుట్టాకా వారి ఆలనాపాలనా చూసుకుంటూ భర్త మహేష్ మూవీ డేట్స్ ఆయన సినిమాలకు పబ్లిసిటీ వ్యవహారాలు బిజినెస్ లు చూసుకుంటుంది. అంతేకాకుండా మహేష్ నిర్మించిన జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థను దగ్గర ఉండి నడిపిస్తుంది.
ఇక ఇవన్నీ పక్కన పెడితే ఎన్నోసార్లు, ఎంతోమంది ఆమె రీ ఎంట్రీ గురించి అడిగినవారే. కానీ తన రీ ఎంట్రీ గురించి ఆమె ఎప్పుడు చెప్పే మాట ఒకటే .. కుటుంబ బాధ్యతలతో నేను సంతోషంగా ఉన్నాను.. రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదు అని.. తాజాగా మరోసారి నమ్రత అదే విషయాన్ని చెప్పడం విశేషం. మంగళవారం హైదరాబాద్లో తన ఫ్రెండ్స్ ప్రారంభించిన స్టైలింగ్ స్టోర్ ఆవిష్కరణకు హాజరైన నమ్రతకు రీ ఎంట్రీ ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె మాట్లాడుతూ “అభిమానులకు తెరపై మళ్లీ నన్ను చూడాలనుంది. కానీ నేను వాళ్లను ప్రతిసారి హర్ట్ చేస్తూనే ఉన్నాను. ప్రస్తుతం నేను నా కుటుంబ బాధ్యతలను చూసుకోవడంలో బిజీగా ఉన్నాను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకే సినిమాలపై దృష్టి పెట్టడం లేదు.. ముందు ముందు కూడా పెట్టే ఆలోచన కూడా ఉండకపోవచ్చని” చెప్పుకొచ్చింది. దీంతో మరోసారి ఆమె రీ ఎంట్రీ ఇక ఇవ్వదు అని అర్ధం అయిపోయింది. ఇక మహేష్ గురించి మాట్లాడుతూ మహేష్ కు షాపింగ్ అంటే అస్సలు నచ్చదని, తనకోసం కూడా తానే షాపింగ్ చేస్తానని తెలిపింది.
