అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు అక్కినేని నాగార్జునకు పర్శనల్ మేకప్ మేన్ గా పనిచేసిన బొమ్మదేవర రామచంద్రరావు గతంలో అనుష్క నాయికగా ‘పంచాక్షరి’ చిత్రాన్ని సముద్ర దర్శకత్వంలో నిర్మించారు. ఇప్పుడు బొమ్మదేవర శ్రీదేవి సమర్ఫణలో సాయిరత్న క్రియేషన్స్ బ్యానర్ లో రెండో చిత్రానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. మరో విశేషం ఏమంటే ఈ సినిమా ద్వారా తన కొడుకు తేజ్ బొమ్మదేవరను హీరోగా పరిచయం చేస్తున్నారు. రిషిక లోక్రే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ గురువారం అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని నాగచైతన్య క్లాప్ కొట్టగా, ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్ ను ఏసీయస్ కిరణ్ దర్శకుడికి అందించారు.
అనంతరం బొమ్మదేవర రామచంద్రరావు మాట్లాడుతూ, ”చిత్ర ప్రారంభోత్సవానికి మేం పిలవగానే వచ్చిన హీరో నాగ చైతన్య కు, సి. కళ్యాణ్, సముద్ర, నాకు ఈ మూవీ చేసే అవకాశం కల్పించిన నాగార్జున గారికి ధన్యవాదములు. మంచి యూనిక్ సబ్జెక్టు లభించడంతో ఈ సినిమా చేస్తున్నాను. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ఇది ఉంటుంది. ఈ చిత్రం ద్వారా హీరో గా పరిచయమవుతున్న మా అబ్బాయిని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ నెల 10 నుండి 21వ తేదీ వరకు మొదటి షెడ్యూల్ చేసుకుని జులై ఫస్ట్ నుండి అరకు లో మిగిలిన షూటింగ్ జరుపుకుని సెప్టెంబర్ లో షూటింగ్ పూర్తి చేసుకొని అదే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇందులో రాజు సుందరం అద్భుతమైన కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. మంచి ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఏంటర్ టైన్ చేస్తుంది” అని అన్నారు. చిత్ర హీరో తేజ్ మాట్లాడుతూ, ”చిన్నప్పటి నుండి సినిమా అంటే ప్యాషన్. మా నాన్న గారు నన్ను ఫోర్స్ చేయలేదు. నీకు ఏది ఇష్టమో అది చేయమన్నారు. నాకు నటనపై ఆసక్తి ఉండడంతో సినిమాకు కావాల్సిన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్ని నేర్చుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను” అని చెప్పారు.
జయప్రకాష్, శైలజా ప్రియ, మేకా రామకృష్ణ, నవీన్ నేని, రవి శివతేజ, మాస్టర్ అజయ్, అంజలి, శ్రీలత తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు వాసు సినిమాటోగ్రఫీని, వికాస్ బాడిస సంగీతాన్ని అందిస్తున్నారు.
