హైదరాబాద్ నగరంలో రాడిసన్ పబ్ ఘటన టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పబ్‌లో జరిగిన రేవ్ పార్టీలో పలువురు సెలబ్రిటీలు ఉన్నారని పోలీసులు చెప్పడంతో ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగబాబు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ పార్టీకి మెగా డాటర్ నిహారిక వెళ్లిన విషయాన్ని ఖరారు చేశారు. అయితే నిహారిక ఎలాంటి తప్పు చేయలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. పబ్‌ను సమయానికి మించి నడపడం వల్లే పోలీసులు యాక్షన్ తీసుకున్నారని.. నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని తనకు పోలీసులు సమాచారం ఇచ్చారని నాగబాబు తెలిపారు. నిహారికపై అనవసర ప్రచారాలు చేయవద్దని.. సోషల్ మీడియాలో ఊహాగానాలు వ్యాప్తి చేయవద్దనే తాను ఈ ఘటనపై స్పందిస్తున్నట్లు నాగబాబు పేర్కొన్నారు.
కాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న రాడిసన్ పబ్‌పై గతంలో ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకపోవడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బంజారాహిల్స్ ఏసీపీ, సీఐపై చర్యలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ సీఐ శివచంద్రను సస్పెండ్ చేశారు. ఏసీపీ సుదర్శన్‌కు చార్జ్ మెమో జారీచేశారు. డ్రగ్స్ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ సీపీ సీవీ ఆనంద్ ఏసీపీని ఆదేశించారు.
