NTV Telugu Site icon

‘నయీం డైరీస్’ దర్శకుడి బేషరతు క్షమాపణ!

Naeem Diaris

Naeem Diaris

మాజీ మావోయిస్టు, ఆపైన పోలీస్ ఇన్ఫార్మర్ ముద్ర వేయించుకున్న నయీమ్ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన విషయం తెలిసింది. ఆ నరహంతక నయీం జీవిత కథ ఆధారంగా దాము బాలాజీ రూపొందించిన ‘నయీం డైరీస్’ మూవీ శుక్రవారం విడుదలైంది. నయీం జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తెరకెక్కించే క్రమంలో దర్శకుడు దాము బాలాజీ కొంత స్వేచ్ఛను తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ గాయని స్వర్గీయ బెల్లి లలితకు, నయీమ్ కు మధ్య ప్రేమాయణం సాగిందని, మావోయిస్టు దళ నాయకుడిని పట్టించడానికి లలిత అంగీకరించకపోవడంతో కక్షకట్టిన నయీమ్, తన సోదరుడితో ఆమెను ముక్కలు ముక్కలుగా నరికించినట్టు దాము బాలాజీ ఈ చిత్రంలో చూపించాడు. అయితే లలిత పాత్ర పేరును లతగా మార్చాడు. ఈ పాత్ర చిత్రణపై బెల్లి లలిత కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

‘నయీం డైరీస్’ మూవీ విడుదలకు ముందు తనకు తెలిసిన సమాచారం మేరకు ఆ పాత్రను అలా తెరపై చూపించానని చెప్పిన దర్శకుడు దాము బాలాజీ ఇప్పుడు వెనకడుగు వేశాడు. తెలంగాణకు చెందిన అమరులైన ఓ మహిళ గురించి తాను తెరపై చూపించిన సన్నివేశాలు ఆమె కుటుంబ సభ్యులను, అభిమానులను బాధపెట్టినట్టు తన దృష్టికి వచ్చిందని, అందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. చిత్ర ప్రదర్శనను నిలిపివేసి, వెంటనే ఆ సన్నివేశాలను తొలగిస్తానని దాము ఓ ప్రకటనలో తెలిపాడు.