Nabha Natesh: సుధీర్ బాబు సొంత సినిమా ‘నన్ను దోచుకుందువటే’ తో ఐదేళ్ళ క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ నభా నటేశ్. అయితే ఆ తర్వాత రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘అదుగో’ మూవీ ఆడకపోయినా… పూరి జగన్నాథ్ సొంత సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’తో మాస్ ఆడియెన్స్ కు కిక్కెక్కించింది నభా! 2020లో రవితేజా ‘డిస్కో రాజా’లోనూ, సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీలోని నభా నటేశ్ నటించింది. ఇక రెండేళ్ళ క్రితం ‘అల్లుడు అదర్స్’లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటించిన నభా, నితిన్ సొంత చిత్రం ‘మాస్ట్రో’లో యాక్ట్ చేసింది. చిత్రం ఏమంటే… ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమాలోనూ నభా కనిపించలేదు.
ఇక కొత్త సంవత్సరం మొదలైన సందర్భంగా… నభా నటేశ్ గత యేడాది తన జీవితంలో జరిగిన ఘోర సంఘటనలను గుర్తు చేసుకుంది. ఊహించని విధంగా జరిగిన ఓ యాక్సిడెంట్ కారణంగా తన ఎడమ భుజానికి మల్టిపుల్ ఫ్యాక్చర్స్ అయ్యాయని, ఇప్పుడు దాని నుండి కోలుకున్నానని తెలిపింది. ఊహించని ఈ సంఘటనతో శారీరకంగానూ, మానసికంగానూ కూడా తను ఎంతో పెయిన్ అనుభవించానని నభా సోషల్ మీడియా ద్వారా చెప్పింది. ఈ యాక్సిడెంట్ కారణంగా తనకెంతో ఇష్టమైన నటనకు కొద్ది కాలం దూరంగా ఉండాల్సి వచ్చిందని వాపోయింది. అయితే ఈ కష్టకాలంలో అభిమానులు చూపించిన ప్రేమ, తాను చేసిన సినిమాలే గొప్ప ధైర్యాన్ని ఇచ్చాయని, గతంలో కంటే మరింత బలాన్ని పుంజుకుని ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నానని నభా నటేశ్ తెలిపింది. మరి నటన పట్ల అమ్మడికి ఉన్న కమిట్ మెంట్ ను గుర్తించి ఏ నిర్మాత తొలి అవకాశం ఇస్తాడో చూడాలి.