కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత నెల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. ఇంకా కన్నడిగులు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం పునీత్ బయోపిక్ శాండల్ వుడ్ లో చర్చానీయాంశంగా మారింది. తాజాగా పునీత్ కి భారీ ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ సంతోష్ కి ఒక అభిమాని తన మనసులో మాట చెప్పాడు. ట్విట్టర్ ద్వారా ఆ అభిమాని ” సార్.. అప్పు(పునీత్) బయోపిక్ తీయండి .. ప్లీజ్.. ఆయనను దగ్గరనుంచి చుసిన వ్యక్తి మీరు.. ఆయన గురించి మీరు తప్ప మరెవ్వరూ అంత హుందాగా తీయలేరు.. ఆయన ప్రేమించే విధానము.. పాటించే విలువలు అన్ని మీకు తెలుసు.. దయచేసి అప్పు సర్ బయోపిక్ తీయండి” అంటూ కోరాడు. దీనికి సంతోష్ సైతం ఒప్పుకోవడం గమనార్హం.
ఆ ప్రశ్నకు సంతోష్ సమాధానం చెప్తూ ” ఈ ఆలోచనను అమలు చేయడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను” అంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే సంతోష్ దర్శకత్వంలో పునీత్ ‘రాజా కుమార’, ‘యువరత్న’ సినిమాల్లో నటించారు. రాజా కుమార పునీత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. యువరత్న సినిమాతో పునీత్ తెలుగువారికి సుపరిచితుడయ్యాడు. మరి సంతోష్ కనుక పునీత్ బయోపిక్ తీస్తే కన్నడిగుల ఆనందానికి అవధులు ఉండవని అభిమానులు చెప్తున్నారు.
