Site icon NTV Telugu

Tollywood: టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత

టాలీవుడ్‌కు మరో సీనియర్ నటుడు దూరమయ్యారు. ముత్యాల ముగ్గు ఫేం నటుడు పి.వెంక‌టేశ్వర‌రావు (90) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. గ‌త కొన్ని రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ఈరోజు ఆయ‌న‌ క‌న్నుమూశారు. రంగ‌స్థల క‌ళాకారుడిగా ప‌లు నాట‌కాల్లో న‌టించిన‌ వెంక‌టేశ్వరరావు 1965లో సూప‌ర్‌ స్టార్ కృష్ణ హీరోగా న‌టించిన తేనెమ‌నసులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ త‌ర్వాత ఏడాదిలోనే మ‌ళ్లీ కృష్ణ న‌టించిన‌ క‌న్నె మ‌న‌సులు చిత్రంలో న‌టించారు.

అయితే 1975లో లెజెండ్రీ డైరెక్టర్ బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ముత్యాల ముగ్గు చిత్రంలో పూజారి పాత్రలో వెంకటేశ్వరరావు నటించి అందరి ప్రశంసలు పొందారు. ఈ సినిమాతో ఆయన ముత్యాల ముగ్గు వెంకటేశ్వరరావుగా మారిపోయారు. ముత్యాల ముగ్గుతో పాటు ఆత్మీయులు, మట్టిలో మాణిక్యం, సుడిగుండాలు లాంటి చిత్రాల్లో కూడా వెంకటేశ్వరరావు నటించారు. గతంలో ఇదేమిటి అనే నాటకంలో నటించి ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు అందుకున్నారు. ఆయన సతీమణి లక్ష్మీ. వీరి దంపతులకు ఏడుగురు పిల్లలు సంతానం.

Exit mobile version