మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ నయనతారతో పాటు ఇందులో బాలీవుడ్ బాద్ షా సల్మాన్ ఖాన్ సైతం జత కట్టడంతో ఈ ప్రాజెక్ట్ మరో లెవెల్ కు చేరుకుంది. తాజాగా ముంబైలో జరిగిన షెడ్యూల్ లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ పై కీలక సన్నివేశాలను దర్శకుడు మోహన్ రాజా చిత్రీకరించిన తర్వాత చిరు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కు సంబంధించిన సీన్స్ ను పిక్చరైజ్ చేసి, ఈ రోజుతో ముంబై షెడ్యూల్ కు ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ విషయాన్ని దర్శకుడు మోహన్ రాజా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సల్మాన్ ఖాన్ వంటి స్వీట్ పర్శన్ తో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, షూటింగ్ ఎంతో కంఫర్టబుల్ గా, మెమొరబుల్ గా సాగిందని, చిరంజీవి సహకారం, ప్రోత్సాహంతో ఇది సాధ్యపడిందని మోహన్ రాజా అన్నారు.
ఇదిలా ఉంటే… ‘గాడ్ ఫాదర్’ మూవీకి మ్యూజిక్ అందిస్తున్న తమన్ సైతం దీని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కొన్ని సన్నివేశాలకు సంబంధించిన రషెస్ చూశానని, అద్భుతంగా ఉన్నాయని చెబుతూ చిత్ర బృందాన్ని ఆకాశానికి ఎత్తేశాడు. అంతేకాదు… ఈ సినిమా కోసం కొత్త కీ-బోర్డులు తెప్పించుకోవాలని, వర్క్ చేస్తున్నప్పుడు అవి స్మాష్ కావడం, పగిలిపోవడం ఖాయమని తమన్ చెప్పాడు. సో… ఇటు దర్శకుడు మోహన్ రాజా మాత్రమే కాదు… సంగీత దర్శకుడు తమన్ సైతం ఫుల్ ఎగ్జయిట్ మెంట్ తో ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు.
